హిజాబ్ ధరించని ఇరాన్‌ యువతిని కాల్చి చంపిన భద్రతా దళాలు

తలపై స్కార్ఫ్ (హిజాబ్) లేకుండా కనిపించి ఓ నిరసనలో పాల్గొన్న ఇరాన్‌ యువతిని ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఆమె ఛాతీ, ముఖం, మెడ, కడుపు భాగంలో భద్రతా దళాలు తుపాకీతో కాల్పులు జరుపడంతో ఆరు బులెట్లు ఆమె శరీరంలోకి చొచ్చుకెళ్లడంతో ఆ యువతి చనిపోయింది.

హదీస్ నజాఫీ (20) హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలో మృతి చెందడం గమనార్హం. ఈ నెల 21న తుపాకీ గుండ్లకు గురైన ఆమెను ఆసుపత్రిలో చేర్చడంతో, ఆమె మృతి చెందినట్లు గత ఆదివారం ప్రకటించారు.

దీంతో ఆ మహిళ అంత్యక్రియల సందర్భంగా ఆ దేశ ప్రజలు కన్నీరు కార్చుతూ ఉద్వేగానికి గురయ్యారు. జర్నలిస్ట్, మహిళా హక్కుల న్యాయవాది మసీహ్ అలినేజాద్ మాట్లాడుతూ హదీత్ నజాఫీ తలకు కండువా ధరించనందుకు కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

“ఆమె మరణం తనకు విధ్వంసం కలిగించిందని  ఆమె సోదరి నాకు చెప్పింది. తాను మౌనంగా ఉండబోనని చెప్పింది” అని ఆమె తెలిపారు. బహిరంగంగా హిజాబ్‌ సరిగా ధరించనందుకు 22 ఏళ్ల యువతీ మహసా అమిని ఇరాన్‌ నైతిక పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఆమె తలపై కొట్టి చిత్రహింసలకు గురి చేయడంతో ఆ యువతి కోమాలోకి వెళ్లింది.

పోలీసులు అరెస్ట్‌ చేసిన మూడు రోజుల తర్వాత ఈ నెల 16న ఆమె చనిపోయింది. దీంతో అమిని మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే దేశంలోని పలు పట్టణాలు ఈ నిరసనలపై ఇరాన్ భద్రతా దళాలు విచ్చలవిడిగా విరుచుకు పడుతూ కాల్పులు జరుపుతున్నాయి. 

గత వారం ఇరాన్‌లో నిరసనలు చెలరేగడంతో దాదాపు 50 మంది మరణించారు. ఈ మరణాలలో ఎక్కువ భాగం భద్రతా దళాలు ప్రదర్శనకారులను హింసాత్మకంగా అణచివేయడం, కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష మందుగుండు సామగ్రిని ఉపయోగించడం వల్ల సంభవించాయి.

వందలాది మందిని కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని బహిరంగంగా ఈ అణచివేతను ప్రపంచ దేశాలు  సవాలు చేయకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

అయితే, ఇతర పాశ్చాత్య దేశాలతో పాటు మహసా అమినిని “హత్య” చేయడాన్ని ఇంగ్లాండ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నిర్బంధ హిజాబ్ వంటి ఇరాన్ అనుసరిస్తున్న అనేక విధానాల పట్ల ఆ దేశ జనాభాలోని అత్యధికులు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు, ప్రత్యేకించి ద్రవ్యోల్బణం, ప్రపంచ దేశాల ఆంక్షలతో పెచ్చుమీరుతున్న   భారీ కరెన్సీ, వారికి మరింతగా నిరాశను కలిగిస్తున్నాయి.