10 రోజుల తర్వాత బ‌య‌టికొచ్చిన జీ జిన్ పింగ్‌

చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ పది రోజుల తర్వాత బ‌య‌టికి వ‌చ్చారు. వ‌చ్చేనెల 16 నుంచి చైనా క‌మ్యూనిస్టు పార్టీ జాతీయ స‌ద‌స్సు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌ను మంగ‌ళ‌వారం ఆయ‌న ప్రారంభించారు. ఈ నెల 16న‌ షాంఘై స‌హ‌కార సంస్థ (ఎస్సీవో) స‌ద‌స్సులో పాల్గొని తిరిగి వ‌చ్చాక బాహ్య ప్ర‌పంచానికి దూరంగా ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ చైనా సరళిలో సామ్యవాదం కోసం పట్టుదలతో నూతన విజయం కోసం ప్రయత్నాలు కొనసాగించాలని ఆయన పిలుపిచ్చారు. 2012లో జరిగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ 18వ కాంగ్రెస్ తర్వాత సుదీర్ఘకాలంగా పార్టీ అజెండాలో ఉంటూ, పరిష్కారంకు నోచుకోని అనేక సవాళ్ళను పరిష్కరించుకున్నామని, అనేక విజయాలను సాధించుకున్నామని, ఈ విషయంలో మొత్తం పార్టీ, దేశం ప్రజలు ఐక్యంగా ఉన్నామని తెలిపారు

ఎస్సీవో స‌ద‌స్సు త‌ర్వాత బాహ్య ప్ర‌పంచంలోకి రావ‌డం ఇదే తొలిసారి. ఆయ‌న ప‌రోక్షంలో చైనాలో అధికార మార్పిడి జ‌రుగ‌నున్న‌ద‌న్న వ‌దంతులు వ్యాపించాయి. కరోనా జీరో పాల‌సీలో భాగంగా విదేశాల నుంచి వ‌చ్చిన వారు వారం పాటు త‌ప్ప‌నిస‌రి క్వారంటైన్‌లో ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి. త‌ర్వాత మూడు రోజుల పాటు ఇంట్లోనే బ‌స చేయాలి.

జీ జిన్‌పింగ్ గైర్హాజ‌రీలో చైనా క‌మ్యూనిస్టు పార్టీ (సీపీసీ)లో విభేదాలు ఉన్నాయ‌ని వ‌దంతులు వ్యాపించాయి. జీ జిన్‌పింగ్ ప్ర‌భుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. అతి పెద్ద సైనిక సంప‌త్తి గ‌ల చైనా  పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (పీఎల్ఏ) బీజింగ్ వైపు త‌ర‌లుతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు వైర‌ల్ అయ్యాయి.

జిన్‌పింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశార‌ని కూడా ట్వట్ట‌ర్ యూజ‌ర్లు హోరెత్తించారు. 50 వేల మంది సైనిక జ‌వాన్లు బీజింగ్ వైపు క‌దులుతున్నారు. బీజింగ్ మార్గంలో 80 కిలోమీట‌ర్ల పొడ‌వునా సైనిక వాహ‌నాలు క‌నిపిస్తున్నాయ‌ని ఆ పోస్ట్‌ల స‌మాచారం. ఇక చైనా అధ్య‌క్షుడిగా లీ కియామింగ్‌ను సీపీసీ నియ‌మించింద‌ని కూడా వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి.

ఐదేండ్ల‌కోసారి జ‌రిగే చైనా క‌మ్యూనిస్టు పార్టీ జాతీయ స‌ద‌స్సులో మూడో ద‌ఫా చైనా అధ్య‌క్షుడిగా జీ జిన్‌పింగ్‌ను నియ‌మించ‌డానికి రంగం సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. ఈ నెల 16 నుంచి జ‌రిగే ఈ స‌ద‌స్సుకు ఎంపిక చేసిన 2,300 మంది డెలిగేట్స్‌లో జీ జిన్‌పింగ్ కూడా ఉన్నారు.

 జీ జిన్‌పింగ్‌ను అధ్య‌క్షుడిగా కొన‌సాగించే విష‌య‌మై వ‌దంతులు షికారు చేస్తున్న త‌రుణంలో ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం. అయితే, వ‌చ్చే నెల‌లో జీ జిన్‌పింగ్‌ను అధ్య‌క్షుడిగా కొన‌సాగిస్తారా? సోష‌ల్ మీడియాలో పోస్టుల నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో లీ కియామింగ్‌ను నియ‌మిస్తారా? అన్న అంశంపై సందిగ్దత కొనసాగుతున్న‌ది.