జ‌పాన్ మాజీ ప్ర‌ధాని అబేకు నివాళులర్పించిన ప్ర‌ధాని మోదీ

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని అబేకు నివాళులర్పించిన ప్ర‌ధాని మోదీ

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబేకు పుష్ప నివాళి అర్పించారు. షింజో అబేకు ఇవాళ టోక్యోలో తుది వీడ్కోలు ప‌లుకుతున్నారు. నిప్పాన్ హాల్‌లో నివాళి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అబేకు తుది వీడ్కోలు ప‌లికేందుకు సోమ‌వారం ప్ర‌ధాని మోదీ  జ‌పాన్ వెళ్లారు.

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే(67) జులై 8, 2022న దారుణ హత్యకు గురయ్యారు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌కు నమ్మకమైన మిత్రుడిగా వ్యవహరించిన షింజో ఓ మాజీ సైనికుడి తూటాలకు బలయ్యారు. దక్షిణ జపాన్‌లోని నారా నగరంలో రైల్వే స్టేషన్‌ వెలుపల ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ ఘోరం జరిగింది.

జపాన్‌ చరిత్రలో అత్యధిక కాలం (9 ఏళ్లు) ప్రధానిగా కొనసాగిన ఘనత కూడా ఆయనదే. ఆ తర్వాత కొన్నిరోజులకు కుటుంబ సభ్యులు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించారు. జపాన్ ప్రధానిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన షింజో అబె కోసం ప్రధాని ఫుమియో కిషిద తుది వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.

అయితే ఇవాళ ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హిస్తున్న నివాళి కార్య‌క్ర‌మం ప‌ట్ల ఆ దేశంలో వ్య‌తిరేకిత వ‌స్తోంది. ప్ర‌భుత్వ అంత్య‌క్రియ‌ల‌ను వ్య‌తిరేకిస్తూ ప్ర‌జ‌లు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. నిప్పాన్ బుడోకాన్‌ వేదిక వ‌ద్ద‌కు షింజో అబే భార్య అక్కీ అబే అస్థిక‌లను తీసుకువ‌చ్చారు. నిప్పాన్ హాల్ వ‌ద్ద అబే జీవితంపై రూపొందించిన వీడియోను ప్లే చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌ధాని ఫుమియో కిషిదా స్మార‌క సందేశాన్ని ఇచ్చారు. అబే ధైర్యాన్ని, అంకిత‌భావాన్ని ఆయ‌న కొనియాడారు.

భారత్ కు మంచి మిత్రుడిగా మెలిగిన అబెకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రధాని మోదీ సోమవారం టోక్యోకు వెళ్లారు. షింజో అబెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో మైత్రి బలోపేతానికి కృషిచేశారని కొనియాడారు.  ప్రస్తుత ప్రధాని కిషిద కూడా అదే తీరుని కొనసాగిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.

 వీడ్కోలు సభలో పాల్గొనడానికి ముందే జపాన్ ప్రధాని ఫుమియో కిషిదతో ప్రధాని మోదీ  సమావేశమయ్యారు. పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అక్కడే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ తో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వందకు పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.  దీని కోసం18 వేల మంది సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నివాళులు అర్పించేందుకు ప్రజలను కూడా అనుమతించారు. ఆస్ట్రేలియా ప్ర‌ధాని ఆంథోనీ ఆల్బ‌నీస్‌, ద‌క్షిణ కొరియా ప్ర‌ధాని హ‌న్ డ‌క్ సూ కూడా నివాళి అర్పించారు.