పీఎఫ్‌ఐపై కేంద్రం ఐదేండ్లపాటు నిషేధం

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాపై (పిఎఫ్ఐ) కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్‌ఐపై ఐదేండ్లపాటు నిషేధం విధించింది. పీఎఫ్‌ఐతోపాటు దాని అనుబంధ సంస్థలను కూడా బ్యాన్‌ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

” పిఎఫ్ఐ, దాని సహచరులు లేదా అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్‌లను తక్షణమే చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని భావిస్తూ కేంద్ర ప్రభుత్వం తదనుగుణంగా, లభించిన అధికారాలని వినియోగిస్తూ  ఈ చట్టంలోని సెక్షన్ 3లోని సబ్-సెక్షన్ (3) ప్రకారం, ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం రూపొందించిన ఏదైనా ఆర్డర్‌కు లోబడి ఈ నోటిఫికేషన్ అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన తేదీ నుండి ఐదు సంవత్సరాల వరకు అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా నిర్దేశిస్తుంది. ,” అని ఆ ఉత్తరువులో పేర్కొన్నారు.

కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాలలో పలు హత్యలకు పాల్పడడం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఐసిస్, సిమి లాంటి సంస్థలతో సంబంధాలు కలిగి ఉండడం ఇందుకు అసలైన కారణాలుగా తెలుస్తోంది. విదేశాల నుంచి హవాలా మార్గాల్లో భారీగా నిధులు సమీకరించినట్టు సమాచారం. జాతీయ దర్యాప్తు సంస్థ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,  రాష్ట్ర పోలీసు బలగాలు సంయుక్తంగా భారతదేశం అంతటా పిఎఫ్ఐ నాయకులు, సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి.దేశంలోని 15 రాష్ట్రాల్లోని 93 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు.

పిఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, సాయుధ శిక్షణ అందించడం, నిషేధిత సంస్థలలోలో చేరడానికి శిక్షణా శిబిరాలను నిర్వహించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్ధుష్టమైన ఆధారాలు లభించిన తర్వాత నమోదు చేసిన ఐదు కేసులకు సంబంధించి సోదాలు నిర్వహించారు. 

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తుందన్న ఆరోపణల ఎదుర్కొంటున్న పీఎఫ్‌ఐపై ఎన్‌ఐఏ, ఈడీ వరుగా దాడులు నిర్వహించాయి. ఈనెల 22, 24, 27 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, గుజరాత్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇండ్లలో సోదాలు నిర్వహించాయి.

ఈ సందర్భంగా 300 మందికిపైగా పీఎఫ్‌ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నాయి. అదేవిధంగా పీఎఫ్‌ఐకి వ్యతిరేకంగా లభించిన కీలక పత్రాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకున్నది. ఓ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులను హత్య చేసేందుకు, రాష్ట్రాల్లో అలజడులు సృష్టించేందుకు కుట్రపన్నారని అధికారులు తెలిపారు.

ఎన్‌ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలు కలిసి ఆపరేషన్‌ ఆక్టోపస్‌ కింద మంగళవారం పీఎ్‌ఫఐ సభ్యుల ఇళ్లలో జరిపిన సోదాలలో  ఏడు రాష్ట్రాల్లో 170 మందికి పైగా పీఎ్‌ఫఐ కార్యకర్తలు, సభ్యులను అరెస్టు చేశాయి.  ఈ నేపథ్యంలో పీఎఫ్‌ఐపై నిషేధం విధించాలని పలు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. దీంతో పీఎఫ్‌ఐతోపాటు దాని అనుబంధ సంస్థలైన రిహబ్‌ ఇండి ఫౌండేషన్‌, క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌, నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌, నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌, జూనియర్‌ ఫ్రంట్‌, ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌, రిహబ్‌ ఫౌండేషన్‌ కేరళపై ఐదేండ్ల పాటు నిషేధం విధించింది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ 2006లో ఏర్పాటయింది. అయితే మొదట కేరళలో ప్రారంభమై.. ఆ తర్వాత దేశమంతటా విస్తరించింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల సాధికారతే లక్ష్యంగా పనిచేయనున్నామని, అందుకోసం సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ముసుగులో రాడికల్ ఇస్లాంను ప్రచారం చేస్తోందని భద్రతా సంస్థలు ఆరోపించాయి.

నిషేధం పట్ల బిజెపి హర్షం

పిఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం పట్ల బీజేపీ హర్షం ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ప్రధాని మోదీ నాయకత్వంలోని బలమైన ప్రభుత్వం మాత్రమే ఇటువంటి నిర్ణయం తీసుకోగలిగినదని బిజెపి తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ బీజేపీయేతర ప్రభుత్వాలు, వారి రాజకీయ అవసరాల కోసం మైనారిటీల బుజ్జగింపులో భాగంగా పిఎఫ్ఐ వంటి సంస్థలను ఎదగనిస్తూ వచ్చారని ఆయన ఆరోపించారు.

మోదీ ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి చర్యలు విభజన శక్తులు, మత విద్వేషాలను రెచ్చగొట్టే, ద్వేషపూరిత సంస్థలు సామజిక సంస్థల ముసుగులో దేశవ్యాప్తంగా నెట్ వర్క్ లు నిర్మించకుండా ఆపగలవాని విశ్వాసం వ్యక్తం చేశారు.