కేంద్ర ఉద్యోగుల‌కు 4 శాతం డీఏ పెంపు!

దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌ర్ల‌కు 4 శాతం డీఏను పెంచింది. ఏడో వేత‌న క‌మిస‌న్ సిఫార్సుల ఆధారంగా కేంద్రం డీఏ పెంపు ప్రతిపాదనకు
కేంద్ర క్యాబినెట్  ఆమోదం తెలిపింది.
 
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (సీసీఈఏ) సమావేశంలో  ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అనురాగ్  ఠాకూర్ బుధవారంనాడు మీడియాకు తెలిపారు. క‌రువు భ‌త్యం పెంపుతో సుమారు 47.68 ల‌క్ష‌ల మంది కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. మ‌రో 68.62 ల‌క్ష‌ల మంది పెన్ష‌ర్లకు కూడా బెనిఫిట్ జ‌ర‌గ‌నున్న‌ది.
 
సాధార‌ణంగా డీఏను జూలై ఒక‌టో తేదీ నుంచి అమ‌లు చేస్తారు. అయితే కొత్త జీతాల‌తో పాటు ఎరియ‌ర్లను ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మార్చిలో డీఏను మూడు శాతం పెంచిన విష‌యం తెలిసిందే. ఇక న్యూఢిల్లీ, అహ్మ‌దాబాద్‌, ముంబై ప్ర‌ధాన రైల్వే స్టేష‌న్ల అభివృద్ధి కోసం రూ 10,000 కోట్లు వెచ్చించే ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.
 
పండగ సీజ‌న్ నేప‌ధ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం ఉచిత రేష‌న్ ప‌ధ‌కాన్ని మ‌రో మూడు నెల‌లు పొడిగించింది. భార‌తీయ రైల్వేలను అప్‌గ్రేడ్ చేసేందుకు రూ 10,000 కోట్లు ప్ర‌క‌టించింది. పీఎం గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న ప‌ధ‌కాన్ని మ‌రో మూడు నెలలు పొడిగించాల‌ని కేంద్ర క్య‌బినెట్ నిర్ణ‌యించింద‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్ల‌డించారు.