మరోసారి రేపో రేట్ పెంచిన ఆర్‌బిఐ

రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటును మరో 0.50 శాతం పెంచి, 5.90 శాతానికి చేర్చడంతో మూడేళ్ల గరిష్టానికి చేరింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ బ్యాంకుల విధానాలు, ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఆర్‌బిఐ పేర్కొంది. ఈనెల 28-29ల్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపిసి) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు.
మేలో 0.40 శాతం, జూన్‌, ఆగస్టులో 0.50 శాతం చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా 0.50 శాతం పెంచడంతో 4 నెలల వ్యవధిలోనే రెపోరేటు 1.90 శాతానికి చేరింది. అంటే ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటిదాకా మూడు దఫాల్లో మొత్తం 140 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును ఆర్‌బిఐ పెంచింది.
చివరి రెండు సార్లు 50 బేసిస్‌ పాయింట్ల చొప్పున సవరించింది. దేశీయ రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ ఇప్పటికే మే నుండి కీలకమైన పాలసీ రేటను 140 బేసిన్‌ పాయింట్లతో 5.4 శాతానికి పెంచడంతో ఈ ఏడాది గరిష్ట పరిమితి 6 శాతం కంటే అధికంగా ఉంది.
వడ్డీ రేట్ల పెంపుతో గృహ, వాహన రుణాలతో పాటు ఇతర రుణాలు మరింత భారం కానున్నాయి. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు కళ్లెం వేయడం కోసం ఈ రేటును కోవిడ్-19 మహమ్మారి రావడానికి ముందు ఉన్న స్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది.