కోటక్ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు

కొటక్‌ మహీంద్రా బ్యాంకుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం షాక్‌ ఇచ్చింది. ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాకింగ్‌ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అదే సమయంలో క్రెడిట్‌కార్డుల జారీని తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది.  ప్రస్తుతం ఉన్న క్రెడిట్‌కార్డులతో పాటు ఖాతాదారులకు సేవలు యథావిధిగా కొనసాగించవచ్చని ఆర్‌బీఐ చెప్పింది.

కొటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో లోపాలను గుర్తించిన తర్వాత చర్యలు చేపట్టినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.  2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఆడిట్‌లో గుర్తించిన లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయా లోపాలు, సమస్యలను పరిష్కరించడంలో బ్యాంక్ విఫలమైందని ఆర్‌బీఐ పేర్కొంది.

బ్యాంక్‌ ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ప్యాచ్ అండ్ ఛేంజ్ మేనేజ్‌మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్‌మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా లీక్‌లను ప్రివెన్షన్‌లో స్ట్రాటజీ లోపభూయిష్టంగా ఉందని ఆర్‌బీఐ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు ఐటీ రిస్క్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ గవర్నెన్స్‌ విషయంలో రెండు సంవత్సరాలు మార్గదర్శకాలు పాటించలేదని తెలిపింది. ఈ క్రమంలో బ్యాంకుపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. 

ఇకపై బ్యాంకు ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఛానెల్స్‌ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంతో పాటు కొత్త క్రెడిట్‌ కార్డులను జారీ చేయడం నిలిపివేయాలని ఆదేశించినట్లు పేర్కొంది.  అయితే, ప్రస్తుతం ఉన్న క్రెడిట్‌ కార్డు వినియోగదారులతో పాటు ఇతర వినియోగదారులకు గతంలో మాదిరిగానే సేవలు అందించవచ్చని ఆర్‌బీఐ ప్రకటనలో స్పష్టం చేసింది.

బ్యాంక్ ప్రస్తుత ఖాతాదారులకు వారి వారి ఖాతాలలోని డబ్బు సురక్షితంగానే ఉంటుంది. వారు తమ క్రెడిట్ కార్డు కార్యకలాపాలను కూడా కొనసాగించవచ్చు. ప్రైవేటు రంగ బ్యాంకు కోటక్‌ మహీంద్రా బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నాళ్ల క్రితం కూడా కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు జరిమానా విధించింది. కోటక్‌ మహీంద్రా బ్యాంకుకు రూ.3.95కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.

 ఆర్థిక సేవల అవుట్‌ సోర్సింగ్‌లో రిస్క్‌లు, ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, రికవరీ ఏజెంట్లు, కస్టమర్‌ సర్వీసుకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు కోటక్‌ బ్యాంకుకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. 

రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు మాత్రమే కోటక్ బ్యాంకుకు జరిమానా విధించామని, ఖాతాదారుల లావాదేవీలకు ఈ జరిమానాలతో సంబంధం లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ ఇటీవలి కాలంలో పలు బ్యాంకులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు ఉల్లఘించిన వాటిపై భారీ జరిమానాలు, ఆంక్షలు విధిస్తోంది.