వచ్చే ఐడేళ్లలో అందరికీ కన్ఫర్డ్ రైలు టికెట్లు

రానున్న ఐదేళ్లలో రైల్వే ప్రయాణికులందరికీ కన్ఫర్డ్ టికెట్ లభిస్తుందని రైల్వే, ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ  ఇస్తున్న గ్యారెంటీగా ఆయన అభివర్ణించారు. గత పదేళ్లలో రైల్వేలో అనూహ్యమైన మార్పులు వచ్చాయని ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. 

వచ్చే ఐదేళ్లలో రైల్వేల సామర్థ్యాన్ని పెంచి రైలు ప్రయాణం చేయదలచిన ప్రతి ప్రయాణికుడికి కన్ఫర్డ్ టికెట్ అందచేస్తామని వైష్ణవ్ తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధానంగా దోహదపడే రైల్వేలను మరింత బలోపేతం చేస్తామని, ప్రయాణికులకు అందచేసే సౌకర్యాలను మరింత వేగంగా విస్తరిస్తామని ఆయన చెప్పారు.

2014 నుంచి 2024 వరకు దేశంలో 31,000 కిలోమీటర్ల కొత్త ట్రాకులను నిర్మించినట్లు ఆయన తెలిపారు. 2004 నుంచి 2014 వరకు కేవలం సుమారు 5,000 కిలోమీటర్ల విద్యుదీకరణ జరగగా గడచిన పదేళ్లలో 44,000 కిలోమీటర్ల రైల్వే విద్యుదీకరణ జరిగిందని వైష్ణవ్ వెల్లడించారు. 

2004 నుంచి 2014 వరకు కేవలం 32,000 బోగీలను మాత్రమే తయారుచేయగా గత పదేళ్లలో 54,000 బోగీలను తయారు చేయడం జరిగిందని ఆయన వివరించారు. 2014కి ముందు గూడ్సు రైళ్ల కోసం ప్రత్యేక కారిడార్‌కు సంబంధించి ఒక్క కిలోమీటరు కూడా నిర్మించలేదని, కాని తమ హయాంలో 2,734 కిలోమీటర్ల రెండు ప్రత్యేక గూడ్సు కారిడార్లను ప్రారంభించామని ఆయన తెలిపారు.