విశాఖ రైల్వే జోన్ పై పుకార్లను నమ్మొద్దు

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం స్పష్టం చేశారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేయడం లేదంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైల్వే జోన్ ఏర్పాటుకు విశాఖ డీఆర్ఎమ్ ఆఫీస్ దగ్గరలో భూమి అందుబాటులో ఉందని తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
 
ఇలా ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సందర్భంగా నెలకొన్న వివాదాలను పరిష్కరించడం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి అధికార సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలకమైన విశాఖ రైల్వే జోన్‌ ఆచరణలో సాధ్యం కాదని రైల్వే బోర్డు అధికారులు తెలిపారని వార్తలు వచ్చాయి. దానితో రైల్వే జోన్ ప్రతిపాదనకు కేంద్రం తిలోదకాలిచ్చిన్నట్లే అనే కథనాలు వెలువడ్డాయి.
 
వైజాగ్‌ రైల్వేజోన్‌ సాధ్యం కాదని రైల్వే బోర్డు అధికారులు చెప్పడంతో సాధ్యం కాదు కాబట్టే చట్టంలో పెట్టారని, చట్టాన్ని అమలు చేసి తీరాలని రాష్ట్ర అధికారులు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. ఈ దశలో జోక్యం చేసుకున్న కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా సాధ్యం కాదని మీరెలా చెబుతారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మీ స్థాయిలో నిర్ణయం తీసుకోవద్దని రైల్వే అధికారులనుద్దేశించి ఆయన అన్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రి వర్గం ముందు పెట్టాలని, కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పినట్లు సమాచారం.
 
మరోవంక, కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. పత్రికలు కొందరి కుయుక్తులకు లోబడి అసత్య కథనాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. మీడియా ఈ అంశంలో అపోహలు పెంచే విధంగా ప్రచారం చేస్తుండడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
 
కొత్త రైల్వే జోన్ పై రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాఠీతోనే ప్రకటన చేయిస్తానని ఆయన వెల్లడించారు. అంతేకాదు, రైల్వే జోన్ ఏర్పాటుపై పార్లమెంటులో రైల్వే మంత్రి చేసిన ప్రకటనను కూడా జీవీఎల్ ఈ సందర్భంగా చదివి వినిపించారు.