తమిళనాడులో ఆర్ఎస్ఎస్, బీజేపీ వార్లపై `పెట్రో’ దాడులు

ఆర్ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై తమిళనాడులో పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తాంబరంలో ఉంటున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక అగంతకుడు పెట్రోల్ బాంబ్ విసిరాడు. నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 
గత 24 గంటల్లో ఈ తరహా దాడులు కనీసం పది వరకు జరిగిన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాద సంబంధాలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా కీలక దాడులు జరుపుతున్న నేపథ్యంలో తమిళనాడులో పెట్రోల్ బాంబులు రువ్విన ఘటనలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్, పరిసర జిల్లాలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాలపై, నాయకుల ఇండ్లపై, వారి వాహనాలపై దాడులు జరుగుతున్నాయి.

కాగా, తన ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన నివాసం వెలుపల పెద్ద శబ్దం రావడం, మంటలు చెలరేగడం కనిపించిందని అన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని తాను అనుకున్నప్పటికీ అది కాదని తేలిందని చెప్పారు.

వెంటనే మంటలు ఆర్పివేసి, పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. నిందితుడు ఫుటేజ్ లభించినట్టు చెప్పారు. కోయంబత్తూరులోని కోవైపుదూర్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దాడి ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఒప్పనకర వీధిలోని ఓ వస్త్రాల షాప్ పై, ఈరోడ్ లో ఓ ఫుర్నిచర్ షాప్ పై, కోయింబత్తుర్ లో ఓ హిందూ మున్నని నాయకుడి కారుపై బాంబులు వేసిన సంఘటనలు జరిగాయి. తిరుపూర్ లో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కారుపై రాళ్లు వేశారు. మెట్టుపాళ్యంలో ఓ హిందూమున్నని నాయకుడి షాప్ పై నాలుగు పెట్రో బాంబులు విసిరారు. పలువురు కార్యకర్తల వాహనాలపై కూడా దాడులు జరిగాయి.

కేరళలోని కన్నూరులో సైతం ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై ఇదే తరహా దాడి జరిగింది. పీఎఫ్ఐ ఇచ్చిన బంద్ పిలుపు నేపథ్యంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబ్ విసిరారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ దాడుల నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. తమిళనాడు స్పెషల్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన రెండు కంపెనీలను శుక్రవారం కోయంబత్తూరులో భద్రత కోసం మోహరించారు. తిరుప్పూర్, పొల్లాచ్చిలో భద్రత కోసం మరో రెండు కంపెనీలను రప్పించారు.

“ఈ బృందాలకు 24 గంటలూ పెట్రోలింగ్ నిర్వహించాలని, వాహనాల తనిఖీకి ఆదేశించామని, సున్నిత ప్రదేశాల్లో పోలీసులు నిఘా పెట్టారని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మున్నాని కార్యాలయాలకు రక్షణ కల్పించామని” కోయంబత్తూరుకు చెందిన సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి దాడులను అరికట్టాలని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు అన్ని పోలీసు కమిషనర్లు, జోనల్ ఐజీలు, డీఐజీలు, ఎస్పీలను అప్రమత్తం చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో విఫలమైందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.  పెట్రోలు బాంబులు విసిరి తమ అన్నదమ్ముల మనోధైర్యాన్ని తగ్గించగలమని ఎవరూ అనుకోవద్దని స్పష్టం చేశారు.  ఇలాంటి బెదిరింపులు సంఘవిద్రోహ శక్తులు తమ సామాజిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తాయని  తెలిపారు. ఇదే విధమైన అభిప్రాయాలను ప్రతిధ్వనిస్తూ,  బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జి సూర్య బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలపై దాడుల చిత్రాలను విడుదల చేశారు.

 “కోయంబత్తూర్ నుండి చెన్నై వరకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు జిహాదీల దాడిలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఇటువంటి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సామాజిక శక్తులను మొగ్గలోనే తుడిచిపెట్టి, సాధ్యమైనంత కఠినంగా శిక్షించి విచారించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయని విమర్శించారు. 

2047 నాటికి దేశంలో ఇస్లామిక్ రాజ్యం!
 
ఇలా ఉండగా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల నిర్వహించిన దాడుల్లో కీలక సమాచారం బయటపడింది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చేతికి ‘ప్లాన్ 2047’ అనే పుస్తకం చిక్కింది. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్ళు పూర్తయ్యే సరికి దేశంలో ఇస్లామిక్ రాజ్యంను స్థాపించాలని, షరియా చట్టంను అమలు చేయాలని లక్ష్యంగా ఈ పుస్తకంలో వెల్లడైంది.
 
కుర్లాలో నివసిస్తున్న మజహర్ ఖాన్ అనే పీఎఫ్ఐ సభ్యుడి ఇంటి నుంచి ఈ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. మజహర్ ఖాన్‌కు ఐదేళ్ళ క్రితం పక్షవాతం వచ్చిందని, ఆయన కార్యకలాపాలు కొనసాగించడం కోసం పీఎఫ్ఐ ఆయనకు నెలకు రూ.10,000 చొప్పున చెల్లిస్తోందని తెలిపాయి.