థాయిలాండ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే వారి పట్ల జాగ్రత్త

థాయిలాండ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని భారతీయ విద్యార్థులను  భారత విదేశీ వవ్యహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.  ఇటీవల మయన్మార్‌లో మైవాడ్డీ ప్రాంతంలో ఉద్యోగాల స్కామ్‌లో ఇరుక్కున్న 30 మంది భారతీయులను భారత దౌత్యకార్యాలయం రక్షించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ హెచ్చరించింది

థాయ్‌లాండ్‌లో నకిలీ ఉద్యోగాల రాకెట్లు కొన్ని బూటకపు ఐటి సంస్థల ద్వారా డిజిటల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి   విద్యార్థులను నమ్మిస్తున్నాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.  భారతీయ విద్యార్థులే లక్ష్యంగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది.

ఐటీ ఉద్యోగాల పేరిట న‌కిలీ జాబ్ రాకెట్ల దందాకు సంబంధించి  భారత విదేశీ వవ్యహారాల మంత్రిత్వ శాఖ మార్గద‌ర్శకాల‌ను విడుదల చేసింది. గతంలో మ‌య‌న్మార్‌లో చిక్కుకున్న భార‌తీయుల వీడియో బ‌హిర్గత‌మైన నేప‌థ్యంలో ఈ మార్గదర్శకాల‌ను జారీ చేసింది.

దీని ప్రకారం గతంలో కాల్‌ స్కామ్స్, క్రిప్టో కరెన్స్ ఫ్రాడ్స్ చేసిన ఐటి  సంస్థలే ప్రస్తుతం జాబ్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నాయని తెలిపింది.  బ్యాంకాక్, మయన్మార్‌లో ప్రత్యేక నిఘా ద్వారా వీటిని నిర్థారించినట్లు స్పష్టం చేసింది.  ఫేక్ జాబ్ రాకెట్స్..ఐటీ స్కిల్స్ ఉన్న వారినే టార్గెట్ చేస్తున్నారని, విదేశాంగ శాఖ ప్రతినిధి అరింద్ బాగ్చీ తెలిపారు.

డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో దుబాయ్‌, ఇండియాలోని ఏజెంట్‌లు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన అడ్వైజరీని  షేర్ చేశారు. ఉద్యోగం పేరుతో అక్రమంగా దేశం దాటిస్తున్నారని, ఆ తర్వాత అక్కడ దారుణమైన పరిస్థితుల్లో పని చేయించుకుంటున్నారని వెల్లడించారు.

ఐటి నైపుణ్యం కలిగిన యువకులను లక్షంగా చేసుకుని డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో దుబాయ్, భారత్ కేంద్ర ఏజెంట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తున్నారని వివరించింది. బాధితులను సరిహద్దుల ద్వారా అక్రమంగా ఎక్కువగా మయన్మార్‌కు తరలిస్తున్నారని, అక్కడ కఠినమైన పరిస్థితుల్లో వారిని బందీలను చేసి పనిచేయిస్తున్నారని విదేశీ మంత్రిత్వశాఖ పేర్కొంది.

ఉద్యోగాల కోసం టూరిస్టు, లేదా విజిట్ వీసాలతో అభ్యర్థులు ప్రయాణించే ముందు ఆయా విదేశీ యాజమన్యా సంస్థలు ఎంతవరకు నమ్మదగినవో సంబంధిత దౌత్య కార్యాలయాల ద్వారా పరిశీలించుకోవాలని సూచించింది. ఆగ్నేయ మయన్మార్ కయిన్ రాష్ట్రంలో గల మైవాడ్డీ ప్రాంతం థాయ్‌లాండ్ సరిహద్దుల్లో ఉంది. మయన్మార్ ప్రభుత్వ పూర్తి నియంత్రణలో ఈ ప్రాంతం లేదు. ప్రత్యేక నిర్దిష్ట జాతుల సాయుధ బలగాల అధీనంలో మైవాడ్డీ ప్రాంతం ఉంది. భారతీయ విద్యార్థులు  ఫేక్ జాబ్ రాకెట్ ట్రాప్లో చిక్కుకోవద్దని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ యాడ్‌లకు స్పందించవద్దని హెచ్చరించారు.