కృత్రిమ స్మార్ట్ లింబ్‌ను అభివృద్ధి చేసిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. అంగవైకల్యమున్న వారికి సహాయంగా కృత్రిమ స్మార్ట్ లింబ్‌ను అభివృద్ధి చేసింది. అంతరిక్ష పరిశోధనలో ఉపయోగించే మైక్రోప్రాసెసర్లను ఇందులో వినియోగించింది. దీంతో కాలు తొలగించిన వ్యక్తులు ఈ స్మార్ట్ లింబ్‌తో చాలా తేలికగా, సౌకర్యంగా నడవగలరని ఇస్రో తెలిపింది. ఈ కృతిమ కాలును మైక్రోప్రాసెసర్ నియంత్రిత మోకాలు (ఎంపీకే)గా పేర్కొంది. దీని బరువు 1.6 కిలోలని వెల్లడించింది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ (ఎన్‌ఎల్‌ఎల్డీ), దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్, ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్‌ఐఎంసీవో)తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)లో ఈ మైక్రోప్రాసెసర్ నియంత్రిత మోకాలు (ఎంపీకే)ను అభివృద్ధి చేస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

ఈ స్మార్ట్ లింబ్‌లో మైక్రోప్రాసెసర్, హైడ్రాలిక్ డంపర్, లోడ్, మోకాలి యాంగిల్ సెన్సార్‌లు, కాంపోజిట్ మోకాలి కేస్, లి-అయాన్ బ్యాటరీ, ఎలక్ట్రికల్, ఇంటర్‌ఫేస్ ఎలిమెంట్స్ ఉంటాయని పేర్కొంది. మరోవైపు సెన్సార్ డేటా ఆధారంగా నడక స్థితిని గుర్తించడంతోపాటు సిస్టమ్ దృఢత్వాన్ని మార్చడం ద్వారా కావాల్సిన మాదిరిగా నడిచేందుకు ఎంపీకే ఉపకరిస్తుందని ఇస్రో తెలిపింది.

అంగవైకల్యం ఉన్న కొందరు వ్యక్తులతో వాకింగ్‌ ట్రయిల్స్‌ నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ లింబ్‌ ధర రూ. 4 నుంచి రూ. 5 లక్షలు ఉంటుందని ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇలాంటి లింబ్స్ ధర రూ. 10 నుంచి రూ. 60 లక్షలు ఉంటుందని, దీనితో పోల్చితే ఎంపీకే ధర పది రెట్లు తక్కువ అని వెల్లడించింది.