తిరుమలలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకే బ్రేక్‌ దర్శనాలు

తిరుమలలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకే బ్రేక్‌ దర్శనాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకే బ్రేక్‌ దర్శనాలను  ప్రయోగా త్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు టిటిడి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఆయన అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశమై ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని నిర్ణయించారు.
 
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మౌత్సవాల నిర్వహణ, తిరుమలకు వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకే బ్రెక్‌ దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. బ్రహ్మౌత్సవాల అనంతరం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారని తెలిపారు.
 
ప్రాథమికంగా రోజుకు 20వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. తిరుమల గదుల కేటాయింపులోనూ మార్పులు చేసినట్లు చెప్పారు. తిరుమలలో వసతి గదుల కేటాయింపు తిరుపతిలోనే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.  రూ. 95 కోట్లతో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం, రూ. 30 కోట్లతో చెర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతామని తెలిపారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని నిర్ణయించామని చెప్పారు.
 
రూ. 2.45 కోట్లతో నందకం అతిథి గృహంలో ఫర్నిచర్‌,రూ. 3 కోట్లతో నెల్లూరులో కళ్యాణ మండపాల దగ్గర ఆలయం నిర్మాణం ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీడీ ఆస్తుల విలువ రూ.85,700 కోట్లు అని చెబుతూ టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. వడమాలపేట దగ్గర భవిష్యత్‌ అవసరాల దృష్యా 130 ఎకరాలను రూ.25 కోట్లకు కొనుగోలు చేస్తామని తెలిపారు.