ఆహార ధాన్యాల కొనుగోళ్లలోకీ ప్రైవేట్‌ సంస్థలు

ఆహార ధాన్యాల కొనుగోళ్లలోకీ ప్రైవేట్‌ సంస్థలను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించనుంది. ఇప్పటి వరకు ఆహార ధాన్యాలను ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సిఐ), రాష్ట్ర ఏజెన్సీలు సేకరిస్తునాుయి. ఈ సేకరణలోకి త్వరలో ప్రైవేట్‌ సంస్థలను కూడా రంగంలోకి దించేందుకుకేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని  కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు.
 
ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ కూడా రాసినట్లు తెలిపారు. ఈ లేఖలో ఆహార ధాన్యాల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం రెండు స్పష్టమైన అంశాలు స్పష్టం చేసింది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కొనుగోళ్లపై కేంద్రం రెండు శాతం వరకు మాత్రమే అనుకోని ఖర్చులను అందిస్తుంది.
 
రెండోది, సామర్థ్యానిు మెరుగుపరచడానికి, సేకరణ వ్యయానిు తగ్గించే లక్ష్యంతో సెంట్రల్‌ బఫర్‌ స్టాక్‌ కోసం ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి ప్రైవేట్‌ రంగానిు స్వాగతించాలని పేర్కొంది. బఫర్‌ స్టాక్‌ కోసం ఆహార ధాన్యాలను సేకరించేందుకు  రోలర్‌ ఫ్లోర్‌ మిల్లర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా 82వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సుధాన్షు పాండే ప్రసంగిస్తూ ”మేము కొనుగోలు ప్రక్రియలో ప్రైవేట్‌ రంగాన్ని  కూడా భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాము. ఎఫ్‌సిఐ, రాష్ట్ర ఏజెన్సీలు మాత్రమే ఎందుకు సేకరించాలి?” ఆయన ప్రశ్నించారు.
 

 ఇటీవలి అంతర్జాతీయ ధాన్యాల సదస్సుకు వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని తాను గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం ఉను ఏజెన్సీల కంటే ప్రైవేట్‌ వ్యక్తులు తక్కువ ఖర్చుతో మరింత సమర్థవంతంగా ఆహార ధాన్యాలను సేకరిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు.

”కేంద్ర ప్రభుత్వం రెండు శాతం కంటే ఎక్కువ అనుకోని(యాదృచ్ఛిక) వ్యయాన్ని  భరించదని, రాష్ట్ర ప్రభుత్వాలకు సంకేతం ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ ఇవ్వాలనుకుంటే, అది వారి సొంతంగా చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. దీంతో సేకరణ వ్యయం తగ్గుతుంది” అని చెప్పారు. ప్రస్తుతం కేంద్రం చెల్లిస్తున్న  6 నుంచి 8 శాతం మేరకు కొన్ని రాష్ట్రాలు పన్నులు, ఇతర ఛార్జీలు విధించడంతో సేకరణ వ్యయం పెరుగుతుందని చెప్పారు .

”ఇది సేకరణ వ్యయాన్ని పెంచడమే కాకుండా వినియోగదారులను, పరిశ్రమలను కూడా దెబ్బతీస్తుంది. ఈ అంశాన్ని  రాష్ట్రాలకు తెలియజేశాం. ఇది త్వరలో అమలు చేయబడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయం ప్రస్తుతం చర్చ దశలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాలకు ఆర్థిక వనరులు పరిమితమైనందున కేంద్రం ఈ నిర్ణయాన్ని ఆకస్మికంగా తీసుకోకూడదని, మరోవైపు సేకరణను ఇలాగే వదిలి పెట్టలేమని రాష్ట్రాలు కూడా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.

 
కొన్ని రాష్ట్రాల్లో కొనుగోళ్ల కార్యకలాపాలు సమర్ధవంతంగా ఉన్నప్పటికీ, చాలా రాష్ట్రాల్లో అలా జరగడం లేదని సుధాన్షు పాండే పేర్కొన్నారు. రాష్ట్రాలు కొనుగోళ్ల వ్యవస్థను మెరుగు పరచకుంటే రెండు శాతం అనుకోని వ్యయాన్ని కూడా కేంద్రం భరించదని ఆయన హెచ్చరించారు.