జాతీయ రవాణా విధానంకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం  సమావేశమైన కేంద్ర మంత్రివర్గం జాతీయ రవాణా (లాజిస్టిక్స్) విధానానికి ఆమోదం తెలిపింది. వివిధ విభాగాలు, రంగాలు, న్యాయపరమైన అంశాలతో రవాణా రంగం కోసం జాతీయ రవాణా విధానం కృషి చేస్తుంది. సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అమలు జరుగుతున్న పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్రణాళిక మరింత పటిష్టంగా అమలు జరిగేందుకు జాతీయ రవాణా విధానం సహకరిస్తుంది.
 
రవాణా రంగ సామర్థ్యాన్ని పెంపొందించి,   వివిధ విధానాల క్రమబద్ధీకరణ, మానవ వనరుల సక్రమ వినియోగం, పటిష్ట నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి,ఉన్నత విద్యలో రవాణా అంశాన్ని ఒక  చేర్చడం, సాంకేతికతలను స్వీకరించడం ద్వారా సమర్థతను పెంపొందించాలన్న లక్ష్యంతో జాతీయ రవాణా విధానానికి రూపకల్పన చేయడం జరిగింది.
 
వేగంగా సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు ఉపకరించే విధంగా సాంకేతిక ఆధారిత సమగ్ర, సుస్థిర, పటిష్ట రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న బృహత్తర లక్ష్యంతో విధానానికి రూపకల్పన జరిగింది. ఈ కింది లక్ష్యాలను సాధించేందుకు జాతీయ రవాణా విధానం కృషి చేస్తుంది:
 
i . ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా 2030 నాటికి దేశంలో రవాణా ఖర్చులు తగ్గించడం.
ii. రవాణా రంగ సామర్ధ్య సూచికలో 2030 నాటికి భారతదేశానికి మొదటి 25 దేశాల జాబితాలో స్థానం సాధించడం.
iii. రవాణా రంగం సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమాచార ఆధారిత వ్యవస్థ ద్వారా నిర్ణయాలు తీసుకోవడం.
 
వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, సంబంధిత పారిశ్రామిక వర్గాలు, విద్యావేత్తలతో సుదీర్ఘ చర్చలు జరిపి అంతర్జాతీయంగా అమలు జరుగుతున్న ఉత్తమ విధానాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రవాణా విధానానికి రూపకల్పన చేశారు.  విధానం అమలును పర్యవేక్షించడానికి, సంబంధిత వర్గాల మధ్య సమన్వయం సాధించేందుకు ప్రస్తుతం అమలు జరుగుతున్న  సంస్థాగత వ్యవస్థను ఉపయోగిస్తుంది.
 
జాతీయ కార్యక్రమంగా అమలు జరుగుతున్న పీఎం  గతిశక్తిలో భాగంగా ఏర్పాటైన సాధికారత గల కార్యదర్శుల బృందం లాంటి సేవలను జాతీయ రవాణా విధానం ఉపయోగించుకుంటుంది. సేవలను మెరుగు పరిచేందుకు ఉపకరించే నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ ని సాధికారత గల కార్యదర్శుల బృందం అభివృద్ధి చేస్తుంది. సాధికారత గల కార్యదర్శుల బృందం పరిధిలోకి రాని ప్రక్రియలు, నియంత్రణ, డిజిటల్ విధానాల అభివృద్ధికి  నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ కృషి చేస్తుంది.
 
రవాణా ఖర్చులు తగ్గించేందుకు జాతీయ రవాణా విధానం ద్వారా కృషి జరుగుతుంది. అవసరమైన స్థలంతో గిడ్డంగుల నిర్మాణానికి ప్రణాళిక రూపకల్పన, ప్రమాణాలు పాటించడం, డిజిటలైజేషన్ మరియు ఆటోమేషన్ ద్వారా విలువ ఆధారిత సేవలు అందించడం, సరుకుల రవాణా జరుగుతున్న తీరు పర్యవేక్షించడం లాంటి అంశాలకు విధానంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
 
వివిధ సంబంధిత వర్గాల మధ్య సమన్వయం సాధించడం,  సత్వర సమస్య పరిష్కారం, ఎక్సిమ్ వ్యవస్థల  క్రమబద్దీకరణ , నైపుణ్యం కలిగిన మానవ శక్తి ని అభివృద్ధి చేసి నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి కల్పించే వ్యవస్థను అభివృద్ధి చేసే అంశాలపై కూడా రవాణా విధానం ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ కార్యక్రమాలను తక్షణమే అమలు చేయడానికి ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా విధానం  నిర్దేశిస్తుంది.
 
సాధ్యమైనంత విస్తృత స్థాయిలో విధానం ద్వారా  గరిష్ట ప్రయోజనాలు లభించేలా చూసేందుకు ఏకీకృత రవాణా ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫారమ్ (ULIP), సులభతర లాజిస్టిక్స్ సర్వీసెస్ ప్లాట్‌ఫారమ్, గిడ్డంగుల  ఇ-హ్యాండ్‌బుక్ , పీఎం గతిశక్తిపై శిక్షణా కోర్సులు,  ఐ-గాట్ ప్లాట్‌ఫారమ్‌లో లాజిస్టిక్స్ కార్యక్రమాలు జాతీయ రవాణా విధానం తో సహా    ప్రారంభించబడ్డాయి. విధానాన్ని తక్షణం అమలు చేసేందుకు అవసరమైన పరిస్థితులు ఈ కార్యక్రమాల ద్వారా అందుబాటులోకి వస్తాయి.
 
విధానాన్ని  అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సిద్ధం చేయడం జరిగింది. జాతీయ రవాణా విధానం  తరహాలో పద్నాలుగు రాష్ట్రాలు ఇప్పటికే తమ సంబంధిత రాష్ట్ర  విధానాలను అభివృద్ధి చేశాయి.  13 రాష్ట్రాల్లో ఇది ముసాయిదా దశలో ఉంది. కేంద్రం మరియు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న పీఎం గతి శక్తి  కింద ఏర్పాటైన  సంస్థాగత వ్యవస్థలు రవాణా విధానం  అమలును కూడా పర్యవేక్షిస్తాయి.
 
దీనివల్ల సంబంధిత వర్గాలు విధానాన్ని  వేగంగా మరియు ప్రభావవంతంగా అమలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మరియు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు,  వినియోగ వస్తువులు మరియు ఎలక్ట్రానిక్స్ వంటి ఇతర రంగాల పోటీతత్వాన్ని పెంపొందించడానికి జాతీయ రవాణా విధానం దోహదపడుతుంది.
 
 అవసరాలను సక్రమంగా   అంచనా వేయడం , పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన సరఫరా వ్యవస్థ అభివృద్ధి చెందడం వల్ల రవాణా నష్టాలు తగ్గుతాయి. అవసరానికి మించి  సరకులను నిల్వ చేయాల్సిన  అవసరం తగ్గుతుంది. దేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించడంతో  పాటు ప్రపంచ విలువ ఆధారిత రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవడం ద్వారా   ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం అధిక వాటా పొందేందుకు రవాణా విధానం అవకాశం కల్పిస్తుంది.
 
అంతర్జాతీయ ప్రమాణాలను సాధించేందుకు సహకరించే విధంగా రవాణా ఖర్చులు తగ్గించడం, ప్రపంచ  రవాణా సూచికలో దేశ స్థానం మెరుగుపడేలా చూసేందుకు కూడా జాతీయ రవాణా విధానం అవకాశం కల్పిస్తుంది. భారతదేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చే విధంగా ఖర్చులు తగ్గించడం, సామర్ధ్య పెంపుదల, అంతర్జాతీయ ప్రమాణాల మేరకు రవాణా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన స్పష్టమైన దిశను జాతీయ రవాణా విధానం నిర్దేశిస్తుంది.