శివమొగ్గలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు

కర్ణాటకలోని శివమొగ్గలో బీఈ గ్రాడ్యుయేట్ అయిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తీర్థహళ్లికి చెందిన షరీక్‌, మంగళూరుకు చెందిన మాజ్‌ మునీర్‌ అహ్మద్‌ (22), శివమొగ్గకు చెందిన సయ్యద్‌ యాసిన్‌ (21)పై నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ 1967 చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ చట్టం) కింద శివమొగ్గ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు జాతీయ జెండాను తగలబెట్టినట్లు గుర్తించారు.

పోలీసు సూపరింటెండెంట్ బిఎమ్ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, “వారు ఉగ్రవాద సంస్థ ప్రభావంతో వ్యవహరిస్తున్నారని తేలింది. వారు ఉగ్రవాద చర్యకు కుట్ర పన్నారని, వారి సిద్ధాంతాలను ప్రకటించి, అనుసరించారని’’ ఆరోపించారు. ముఠా సభ్యులు పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారని, రాష్ట్రవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేశారని పోలీసులు ఆరోపించారు.

 పోలీసు ఎఫ్ఐఆర్ ప్రకారం, ముఠా సభ్యులు భారతదేశ ఐక్యత, సమగ్రత , సార్వభౌమత్వానికి హాని కలిగించే ఐఎస్ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. కాగా నిందితులను సెప్టెంబర్ 29 వరకు పోలీసు కస్టడీకి తరలించారు. ఈ ముగ్గురికి ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయని హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు.

బెంగాల్‌లో మావోయిస్టు సభ్యుడు అరెస్టు

మరోవంక, పశ్చిమ బెంగాల్‌లో మావోయిస్టు నాయకుడు సామ్రాట్ చక్రవర్తి అలియాస్ నీల్‌కమల్ సిక్దర్‌ను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఎ ప్రకటించింది. నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు)కి చెందిన దళాలను అస్సాంలో ఏర్పాటు చేయడానికి సంబంధించిన కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఎ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన సేట్ బగన్ రోడ్డులో నివసించే 37 సంవత్సరాల చక్రవరికి అమిత్, అర్ఘ, నిర్మల్, నిర్మాణ్ అని కూడా పిలుస్తారు.
 
కల్యాణి ఎక్స్‌ప్రెస్‌వేపైన నారాయణ స్కూలు సమీపంలోని మహిస్పాత వద్ద చక్రవర్తిని అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఎ ప్రతినిధి తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మావోయిస్టు కేంద్ర కమటీ సభ్యుడు, పార్టీ సిద్ధాంతకర్త, వ్యూహకర్త అరుణ్ కుమార్ భట్టాచార్జీ అలియాస్ జ్యోతిష్, అలియాస్ కబీర్, అలియాస్ కనక్, అలియాస్ కాంచన్‌దా అరెస్టుకు సంబంధించిన కేసులో చక్రవర్తి అరెస్టు జరిగినట్లు ఆయన చెప్పారు.