సీటు బెల్టు పెట్టుకోకుంటే అలారం మోగేలా వ్యవస్థ

కారులో వెనుక సీటులోనూ బెల్టు తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనల ముసాయిదాను జారీ చేసింది. సీటు బెల్టు పెట్టుకోకుంటే అలారం మోగేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేస్తూ నిబంధన తీసుకు వచ్చింది. దీనిపై కేంద్ర రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది.
 
అక్టోబర్‌ 5 వరకు దీనిపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రి ఇటీవల కారు ప్రమాదంలో సీట్ బెల్ట్ పెట్టుకొనని కారణంగా మరణించిన తర్వాత దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయంలో చొరవ తీసుకుని కార్లలో భద్రతా పరమైన చర్యలను అన్ని కంపెనీలు తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 దీనిపై ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని రవాణా శాఖ నిర్ణయించింది. కారులో వెనుక సీటు బెల్టుతో పాటు, అలారమ్‌, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉండేలా అన్ని కార్ల తయారీ కంపెనీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఈ ప్రమాదం జరిగిన తర్వాత గడ్కరీ స్పష్టం చేశారు. వెనుక సీటులో కూర్చున్న వారు కూడా సీటు బెల్టు ధరించాలన్న నిబంధన ఇప్పటికే ఉంది.
 
 దీనిపై చాలా మంది వాహనదారుల్లో అవగాహన లేదు. కేవలం ముందు సీటులో ఉన్న వారు మాత్రమే బెల్టు ధరిస్తున్నారు. ఆధునిక ఫీచర్లు ఉన్న కార్లలో బెల్టు పెట్టుకోకుంటే అలారమ్‌ మోగుతూనే ఉంటుంది. సీటు బెల్ట్‌ అలారమ్‌ మోగకుండా నిరోధించే పరికరాలు ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. ఇలాంటి వాటని విక్రయించవద్దని ఇ-కామర్స్‌ సంస్థలను కేంద్ర ఆదేశించింది.