ప్రతి నాలుగు సెకన్లకు ఒక ఆకలి చావు

ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు సెకన్లకు ఒక ఆకలి చావు సంభవిస్తునుట్లు అంచనా వేసిన్నట్లు 200కి పైగా ఎన్‌జిఓలు హెచ్చరించాయి. అడ్డూ అదుపు లేకుండా పోతూ ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని సమూలంగా నిర్మూలించాలంటే అంతర్జాతీయంగా నిర్ణయాత్మకమైన కార్యాచరణ అవసరమని ఆ సంస్థలు కోరాయి.
 
”ఆకాశన్నంటుతున్న క్షుద్బాధ స్థాయి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 75 దేశాలకు చెందిన సంస్థలు బహిరంగ లేఖపై సంతకాలు చేశాయి” అని ఆ ఎన్‌జిఓలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 34.5 కోట్ల మంది ప్రజలు తీవ్రంగా ఆకలి బాధను ఎదుర్కొంటున్నారని హెచ్చరిస్తూ, 2019 తర్వాత ఈ సంఖ్య రెట్టింపు కన్నా పెరిగిందని తెలిపారు.
 
21వ శతాబ్దంలో కరువు కాటకాలు నెలకొనడాన్ని అస్సలు అనుమతించేది లేదని ప్రపంచ నేతలందరూ హామీల వర్షం గుప్పించారు కానీ వాస్తవానికి అందుకు విరుద్ధంగానే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి వారు పేర్కొన్నారు. సోమాలియాలో మళ్ళీ కరువు రక్కసి కోరలు చాస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లో దాదాపు 5 కోట్ల మంది ప్రజలు ఆకలి చావుల అంచున ఉన్నారని తెలిపారు.
 
ప్రతి రోజూ ఆకలితో దాదాపు 19,700 మంది చనిపోతున్నట్లు అంచనా వేశారని, అంటే ప్రతి నాలుగు సెకన్లకు ఒకరు చనిపోతున్నారని ఎన్‌జిఓలు ఆందోళన వ్యక్తం చేశాయి. ”ఈనాడు వ్యవసాయ రంగంలో, పంటల దిగుబడుల టెక్నికల్లో సాంకేతికత పెరిగినా, 21వ శతాబ్దంలో మనం ఇంకా కరువు కాటకాలు గురించి మాట్లాడుకోవాల్సి రావడం సిగ్గు చేటైన విషయమని బహిరంగ లేఖపై సంతకాలు చేసిన సంస్థల్లో ఒకటైన యెమెన్‌ ఫ్యామిలీ కేర్‌ అసోసియేషన్‌కి చెందిన మొహన్నాఅహ్మద్‌ అలీ ఎల్జాబలీ పేర్కొన్నారు.
 
”ఇది కేవలం ఒక దేశానికి లేదా ఒక ఖండానికి సంబంధించిన సమస్య కాదు, అలాగే ఆకలి ఒక్కటే కూడా కారణం కాదు. మొత్తంగా మానవాళికి జరుగుతున్న అన్యాయం ఇది.” అని ఆయన వ్యాఖ్యానించారు. ”ప్రజలు తమ గురించి, తమ కుటుంబాల భవిష్యత్‌ గురించి ఆలోచించుకుని, అవసరమైనవి సమకూర్చుకోవడానికిగానూ తక్షణమే ప్రాణాధారమైన ఆహారాన్ని, దీర్ఘకాలిక తోడ్పాటును అందించడంపై దృష్టి కేంద్రీకరించడానికి ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరాదు.” అని ఎన్‌జిఓలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.