ఉక్రెయిన్ పై అణుబాంబుకు పుతిన్ సిద్దపడుతున్నారా!

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు అడగడుగునా ఎదురుదెబ్బలు తగులుతుండటంతో చిట్టచివరి ప్రయత్నంగా అణుబాంబులు ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్దపడుతున్నారా? త‌మ ప్రాంతీయ స‌మ‌గ్ర‌త‌కు ఎటువంటి ప్ర‌మాదం జ‌రిగినా ర‌ష్యాను, త‌మ ప్ర‌జ‌ల‌ను కాపాడుకునేందుకు, త‌మ వ‌ద్ద ఉన్న అన్ని ర‌కాల వ్య‌వ‌స్థ‌ల‌ను వాడుకుంటామ‌ని పుతిన్ హెచ్చరించడం గమనార్హం.
 
పైగా, అణ్వాయుధాల‌ను చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేయాల‌నుకునేవాళ్లు ఒక‌టి గుర్తుంచుకోవాల‌ని, ఆ ప‌రిస్థితులు తిర‌గ‌బ‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆయ‌న బెదిరింపు ధోరణిలో పేర్కొనడం ప్రాధాన్యతను సంతరింప చేసుకుంది. రష్యా రిజ‌ర్వ్ సైనికుల్ని కూడా రంగంలోకి దింపేందుకు సంబంధించిన ఆదేశాల‌ను కూడా జారీ చేసిన‌ట్లు జాతిని ఉద్దేశించిన చేసిన ప్ర‌సంగంలో పుతిన్ వెల్ల‌డించారు.
 
ప్రస్తుతం రిజర్వులో ఉన్నవారు, రక్షణ దళాల్లో పనిచేసిన అనుభవజ్ఞులు, ప్రత్యేక నైపుణ్యం గలవారిని సైన్యంలో చేర్చుకోబోతున్నట్లు తెలిపారు. దీంతో సుమారు 3 లక్షల మంది రిజర్వ్ లేదా మాజీ సైనికులు సైన్యంలో చేరే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్కు మద్ధతిస్తున్న పాశ్చాత్య దేశాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాశ్చాత్య దేశాలు హద్దులు మీరాయని మండిపడ్డారు.
రష్యా తన భూభాగాలను రక్షించుకోవడానికి రెండు మిలియన్ల బలమైన సైనిక దళాలను రంగంలోకి దింపనుందని స్పష్టం చేశారు.  తూర్పు ఉక్రెయిన్ లోని డోన్ బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని పుతిన్ తెలిపారు. అక్కడి ప్రజలు ఉక్రెయిన్ లో ఉండాలని కోరుకోవడం లేదని అంటూ  దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని వివరించారు.

ఇలా ఉండగా, రష్యా అధీనంలో ఉన్న దక్షిణ ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో చేరేందుకు రిఫరెండం నిర్వహించనున్నారు. రష్యాలో చేరికపై ఈ వారంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు మంగళవారం వేర్పాటువాద నాయకులు ప్రకటించారు. మాస్కో ప్రారంభించిన యుద్ధంలో భూభాగాలు రష్యాలో భాగమైనందును ఈ వారం చివరి నుంచి ఓట్లను నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

క్రెమ్లిన్ మద్దతు ఉన్న నాలుగు ప్రాంతాలు మాస్కోలో వేదిక పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ బలగాలు తమ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా రష్యా బలగాలను ప్రతిఘటిస్తున్నాయి. ఏడు నెలల క్రితం ప్రారంభమైన యుద్ధంలో మాస్కో ఈ ప్రాంతాన్ని కోల్పోయింది.

ఉక్రెయిన్ తమ ప్రాంతాలను రష్యా బలగాలనుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచన మేరకు రిఫరెండం నిర్వహిస్తున్నట్లు మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ తెలిపారు. డోనెట్స్‌ప్రాంత అధిపతి డెనిస్ పుషిలిన్ మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఈ ప్రాంత ప్రజలకు తమ మాతృభూమిగా భావించే రష్యా దేశంలో భాగమయ్యే హక్కు ఉందని స్పష్టం చేశారు. మిలియన్ల రష్యన్ ప్రజలు ఎదురుచూస్తున్న చారిత్రాత్మక న్యాయాన్ని పునరుద్ధరించడానికి ఓటు సహాయపడుతుందని పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌తో జ‌రిగిన యుద్ధంలో 5937 మంది సైనికులు చ‌నిపోయిన‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోగు తెలిపారు. ఇక ఉక్రెయిన్‌లో చ‌నిపోయిన ఆ దేశ సైనికుల సంఖ్య 10 రేట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన సుమారు 61207 మంది సైనికులు యుద్ధంలో మృతిచెంది ఉంటార‌ని మంత్రి సెర్గీ అంచ‌నా వేశారు.