జగన్ కు జీవితకాల అధ్యక్ష పదవి చెల్లదని ఈసీ స్పష్టం

వైసిపికి శాశ్వత అధ్యక్షునిగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నుకొంటూ ఇటీవల ఒంగోలులో జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో పార్టీ నియమావళిని మార్చడంతో పాటు, ఆయనను ఎన్నుకోవడం చెల్లదని కేంద్ర ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది.  ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. ఇలాంటి ఎన్నిక నియమాలను ఉల్లంఘించినట్లేనని సీఈసీ స్పష్టం చేసింది. ఆ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
 
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మార్గదర్శకాల ప్రకారం.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి రెండేళ్లకోసారి పార్టీ సర్వసభ్య సభను నిర్వహించి, ప్రత్యక్ష విధానంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గదర్శకాలు అంగీకరించవు. అయినప్పటికీ జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
 
ఇలా ఉండగా, శాశ్వత అధ్యక్షుడిగా నియమించినట్టు తమ దృష్టికి వచ్చిన వెంటనే స్పందన కోరుతూ జులై 19న కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్సార్సీపీకి లేఖ రాసింది. అదే నెల 22లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. పార్టీ నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో ఆగస్టు 1న రిమైండర్ పంపించింది.

దానిక్కూడా బదులివ్వక పోవడంతో ఆ పార్టీపై వచ్చిన ఆరోపణలు నిజమేనని కేంద్ర ఎన్నికల సంఘం భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తూ ఆగస్టు 18న మరోసారి నోటీసులు పంపించింది. దీనిపై అదే నెల 23న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సమాధానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమించిన విషయాన్ని ధృవీకరించలేదని, అలాగని ఖండించలేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

ఆ సమాధానంలో జులై 8, 9 తేదీల్లో పార్టీకి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మాత్రమే ప్రస్తావించింది. సెప్టెంబర్ 11న వైఎస్సార్సీపీ సమర్పించిన మరికొన్ని పత్రాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 7న పార్టీ రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేపట్టినట్టు పేర్కొంది.

అదే జవాబులో వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారన్న ఆరోపణలకు బదులిచ్చింది. ఈ అంశం మీడియాలో ప్రచురితమైందని, దీనిపై తాము అంతర్గతంగా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

కాగా, నియంతృత్వ పోకడలకు తావులేకుండా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా రాజకీయ పార్టీ, దాని ఆఫీస్‌ బేరర్లు (అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వగైరా) ఉండాలని, ప్రతి ఐదేళ్లు, అంతకుముందే ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని, ఇతర పదాధికారులను ఎన్నుకోవాలని ప్రజాప్రాతినిధ్య చట్టం(1951)  ప్రకారం రూపొందించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రవర్తనా నియమావళి స్పష్టం చేస్తోంది.
140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న బీజేపీ, రాష్ట్రంలో పాలిస్తున్న వైసీపీ దాకా ఆ నియమావళిని పాటించి తీరాలని అందులోని సెక్షన్‌ 5 చెబుతోంది. రాజకీయ పార్టీలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా కొన్ని అంశాలపై ఈసీ స్పష్టత కోరుతుంది. 13వ ఆప్షన్‌లో రెండో సబ్‌క్లాజు కింద ‘ఆఫీస్‌ బేరర్స్‌ కోసం ఎన్నికలు నిర్వహిస్తుంటారా? లేదా? పార్టీలో అన్ని పదవులకు ఐదేళ్లకోసారయినా ఎన్నికలు నిర్వహిస్తుందా? లేదా? అన్న  ప్రశ్నలకు బదులు ఇవ్వాల్సి ఉంటుంది.