ఢిల్లీ మద్యం కుంభకోణం ఈడీ విచారణలో కవిత సన్నిహితులు?

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)  జరుపుతున్న సోదాలలో హైదరాబాద్ తో గల సంబంధాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్యెల్సీ కవిత సన్నిహితుల పాత్ర కూడా వెల్లడవుతుంది.  తాజాగా, ఈడీ విచారిస్తున్న కరీంనగర్‌ కు చెందిన బిల్డర్ శ్రీనివాసరావు పాత్రపై రాజకీయ వర్గాలలో కలకలం రేగుతున్నది.

బంజారాహిల్స్‌లోని వెన్నమనేని శ్రీనివాసరావు నివాసంతోపాటు ఉప్పల్‌లోని సాలిగ్రామ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మాదాపూర్‌లోని వరుణ్‌ సన్‌ సంస్థ, బంజారాహిల్స్‌లోని జానా ట్రావెల్స్‌ ఏజెన్సీల్లో ఈడీ ప్రత్యేక బృందాలు సోమవారం సోదాలు నిర్వహించాయి.

అతని ఇంట్లో సోదాలు జరిపి, ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు.  అతనికి రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉండటంతో పాటు రాబిన్ డిస్టిలరీ డైరెక్టర్ ప్రేమ్ సాగర్ రావుకు.. శ్రీనివాసరావు దగ్గరి బంధువు అని తెలుస్తోంది. సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్, హైదరాబాద్ లింకులపై  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తుంది.

కవిత ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు నివాసం, కార్యాలయంలో గత శుక్రవారం ఈడీ తనిఖీలలో లభించిన ఆధారాలు, విచారణలో వెల్లడైన సమాచారం మేరకు సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి.

 ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు వరుస తనిఖీలు చేస్తూ లిక్కర్ లింకులపై కూపీ లాగుతున్నాయి. కీలక నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైని ఇప్పటికే ఈడీ విచారించింది. శ్రీనివాసరావు పేరుపై పదుల సంఖ్యలో కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు..  వాటి కార్యకలాపాలు, ఆదాయ మార్గాలపై ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.

పిళ్లై, ప్రేమ సాగర్‌, శ్రీనివాసరావు కలిసి వ్యాపారాలు చేసినట్లు; హవాలా మార్గం ద్వారా శ్రీనివాసరావు నగదు లావాదేవీలు జరిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారని సమాచారం. శ్రీనివాసరావు కంపెనీ ద్వారా ఢిల్లీకి విమాన టికెట్లు బుక్‌ చేసినట్లు అనుమానిస్తున్న ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆయన పాత్రపైనా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.

శ్రీనివాసరావుకు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులతో పరిచయాలు, సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈడీ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవంక, ఉప్పల్ లో సోదాలు జరిపిన సాలిగ్రామ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఇటీవలే కవిత ప్రారంభించడం గమనార్హం. ఇక, వరుస తనిఖీల నేపథ్యంలో అక్కడ లభించే కీలక సమాచారం ఆధారంగా పలువురికి నోటీస్‌లు జారీ చేయడంతోపాటు ఆధారాల మేరకు అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, గతవారం జరిపిన సోదాలలో కవితకు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయం కూడా ఉండడం గమనార్హం. కవితకు 2009 నుంచి వ్యక్తిగత ఆడిటర్‌గా బుచ్చిబాబు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.  దీంతో కవితకు సంబంధించిన జాగృతి కార్యాలయం, ఆమె వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలపై బుచ్చిబాబును అడిగి తెలుసుకున్నట్లు, వాటికి సంబంధించిన పత్రాలను సేకరించినట్లు సమాచారం.

మరికొందరు రాజకీయ ప్రముఖులకు కూడా బుచ్చిబాబు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. పలు సంస్థలకు డైరెక్టర్‌గా ఉన్నారు. గతవారం ఢిల్లీ నివాసంలో సోదాలు జరిపిన  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా బుచ్చిబాబు సీఏగా వ్యవహరించినట్లు సమాచారం.  ఇప్పటివరకు తమ తనిఖీల్లో లభించిన ఆధారాల మేరకు ఈడీ అధికారులు హైదరాబాద్‌లో పలువురికి నోటీసులు జారీ చేసినట్లు, వారిని ప్రశ్నించనున్నట్లు తెలిసింది. అయితే నోటీసుల జారీకి సంబంధించి ఈడీ అధికారులు మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.