ల‌ఖింపూర్‌ఖేరిలో ఇద్ద‌రు ద‌ళిత అక్కాచెల్లెళ్ల రేప్‌, హ‌త్య

ఉత్తర ప్రదేశ్ లోని ల‌ఖింపూర్‌ఖేరిలో ఇద్ద‌రు ద‌ళిత అక్కాచెల్లెళ్లపై అత్యాచారంపై పాల్పడి, వారిని హత్యకు గురి చేసిన దుర్ఘటన తీవ్ర కలకలం రేపుతున్నది. ఈ సంఘటనపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేసింది. 

అత్యాచారంచేసి, వారిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పష్టం చేశారు. రాబోయే తరాలు సైతం వణికిపోయే విధంగా వీరిని శిక్షిస్తామని చెప్పారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను  పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు, 

ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లఖింపూర్ జిల్లాలో ఇద్దరు దళిత మైనర్ అక్కచెల్లెళ్ళపై కొందరు దుండగులు అత్యాచారం చేసి, వారిని చెట్టుకు ఉరివేసి హత్య చేశారు. వీరిద్దరి మృతదేహాలను బుధవారం గుర్తించారు.  ఈ కేసులో నిందితులైన ఛోటు, జునెయిద్, సుహెయిల్, కరీముద్దీన్, అరిఫ్; హఫీజుర్ రహమాన్‌లను అరెస్టు చేశారు. అక్కచెల్లెళ్ళిద్దరికీ నిందితులతో బాగా పరిచయం ఉందని, ఇష్టపూర్వకంగానే నిందితులతో కలిసి మోటార్ సైకిళ్ళపై వెళ్ళారని పోలీసులు చెప్పారు.

కానీ బాధిత కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెలను ఈ నిందితులు అపహరించి, తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ అక్కాచెల్లెళ్ల తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఛోటు తన స్నేహితులతో కలిసి తమ ఇంట్లోకి అక్రమంగా చొరబడి, తనను కొట్టి, తమ కుమార్తెలిద్దరినీ బలవంతంగా లాక్కెళ్ళారని తెలిపారు.

 ‘‘చోటూకు బాలికలు ముందే పరిచయం. అతడే బాలికలకు సుహేల్, జునైద్ లను పరిచయం చేశాడు. సుహేల్, జునైద్ బాలికలను చెరుకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికలు పెళ్లికి పట్టుబట్టడంతో యువకులు ఆగ్రహంతో వారిని చంపేశారు. వారికి మరో ఇద్దరు స్నేహితులు సాయం చేశారు. బాలికలను వారు కిడ్నాప్ చేయలేదని.. స్నేహితులని నమ్మి బాలికలే ఇష్టంతో వెళ్లారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశాం. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం’’ అని ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు. 

ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, రాబోయే తరాలు సైతం వణికిపోయే విధంగా ఈ కేసులో దోషులను శిక్షిస్తామని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని చెప్పారు. తాను స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నానని చెప్పారు.

అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అనే అంశంపై కూడా దర్యాప్తు జరుపుతామని పేర్కొన్నారు. అపరాధం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఈ సంఘటనపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాధితుల్ని రేప్ చేసి, హ‌త్య చేసిన‌ట్లు అటాప్సీ నివేదిక‌లో తేల్చారు. అక్కాచెల్లెళ్ల‌ను  చెట్టుకు ఉరివేసి వేలాడ‌దీసిన‌ట్లు పోలీసులు తెలిపారు.  బాధిత కుటుంబానికి భౌతిక‌కాయాల‌ను అప్ప‌గించిన‌ట్లు అద‌న‌పు డీజీ ప్ర‌శాంత్ కుమార్ తెలిపారు