ఆధునిక భారత్ నిర్మాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య

* జన్మదినం ఇంజనీర్స్ డే నివాళి 
 
వివిధ రంగాలలో భారత దేశ సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు పెంపొందించిన ఆధునిక భారత నిర్మాతలలో అగ్రగణ్యుడుగా డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పేర్కొనవచ్చు.  `ఆధునిక దేవాలయాలు’గా పేరొందిన ప్రసిద్ధి చెందిన నిర్మాణాల ద్వారా మన దేశానికి విశిష్టమైన సేవలందించిన సర్ ఆర్థర్ కాటన్, ఎల్లిస్- కెనడీ వంటి బ్రిటిష్ ఇంజనీర్లతో ధీటుగా భారతదేశ అభ్యుదయానికి విస్తృతమైన, విశేషమైన సేవలు అందించిన ప్రఖ్యాత ఇంజనీరు ఆయన.
నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా,  ధైర్య స్థయిర్యాలకు మారుపేరుగా నిలిచిన భారతరత్న జన్మించిన సెప్టెంబర్ 15వ తేదీని ఇంజనీర్స్‌ డేగా జరుపుతున్నారు.  ఆయన ఓసారి ప్రయాణం చేస్తున్నారు. అంతలో చీకటి పడింది. ఆరాత్రి ఓ ఇంట్లో బస.రాత్రి పూట కూడా పనే. కొవ్వొత్తి వెలిగించుకొని వ్రాయాల్సింది వ్రాసి,ఆ కొవ్వొత్తి ఆర్పేశారు.
మరో కొవ్వొత్తి వెలిగించుకొని మరల వ్రాయాల్సింది వ్రాసి, ఆ కొవ్వొత్తి కూడా ఆర్పేశారు. ‘ఇలారెండు కొవ్వొత్తులు ఉపయోగించడమేమిటి’? అ నిమోక్షగుండంవారిని అడిగితే ‘మొదటికొవ్వొత్తివెలుగులోచేసింది ప్రభుత్వ పని, రెండో కొవ్వొత్తి వెలుగులో చేసింది సొంత పని’అ ని ఆయన సమాధానం.
 
సిరా కూడా ఇలానే వేరువేరుగా ఉపయోగించేవారట ఆయన.ఎంత తక్కువ ఖరీదైనా ప్రభుత్వ సొమ్మును సొంతానికి వాడుకోకూడదనే మోక్షగుండం వారి నిజాయితీని ఏమని పొగడాలి? ఎలా పొగడాలి?ఎంతని పొగడాలి? ఒకసారి విదేశీ పర్యటనకు డబ్బులు అవసరం కాగా మైసూర్‌ బ్యాంక్‌లో తనవద్ద ఉన్న ప్రభుత్వ రుణపత్రాలను తాకట్టుపెట్టారు. బ్యాంక్‌ సిబ్బంది, ప్రజలు విశ్వేశ్వరయ్య నిజాయితీని మెచ్చుకున్నారు. గంధపు చెక్క వలే సేవలో అరిగిపో గానీ ఇనుములా తుప్పు పట్టవద్దనేది ఆయన జీవిత లక్ష్యం.
 
గ్రామీణ, భారీ పరిశ్రమల విషయంలో గాంధీజీ అంతటి వానితో విభేదించి, సాంకేతిక విషయాల మీద ధైర్యంగా, స్థయిర్యంగా, ఆత్మవిశ్వాసంతో, నిర్ద్వంద్వంగా వాదించి సఫలీకృతుడయ్యాడు. భారతరత్న పురస్కారాన్ని అందుకునేందుకు అంగీకరించాల్సిందిగా ప్రధాని నెహ్రూ కోరినప్పుడు విశ్వేశ్వరయ్య సమాధానం…’నేను ఒప్పుకున్నంత మాత్రాన మీ ప్రభుత్వ అభిప్రాయాలకు కట్టుబడి ఉంటానని అనుకోవద్దు’ అని నిర్భయంగా చెప్పిన ధైర్యశాలి మోక్షగుండం.
 
సాంకేతిక, నైతిక విలువల ప్రతిరూపం 
 
ప్రజల కోసం అహరహం పాటుపడిన విశిష్ట ప్రతిభావంతుడు, సాంకేతిక, నైతిక విలువలు మూర్తిభవించిన పవిత్రమూర్తి అయిన. విశ్వేశ్వరయ్య పూర్వీకులు లక్ష్మీపతి భట్టు 16వ శతాబ్దంలో బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామం నుంచి కర్నూలు జిల్లా శ్రీశైలం వెళ్లి పండితుడై కర్ణాటకలోని అవతికి వలస వెళ్లారు. 
 
దొడ్డబైరేగౌడ వీరిని మంత్రిగా నియమించి ముద్దెనహళ్లి, బండేహళ్లి గ్రామాలను దానంగా ఇచ్చారు. వీరి కుమారుడే తిప్పశాస్ర్తి, ఆయన కుమారుడు శ్రీనివాసశాస్త్రి, వారి కుమారుడే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 1861 సెప్టెంబర్ 15న జన్మించారు.  శ్రీనివాసశాస్ర్తి మైసూర్‌లోని చిక్కబళ్లాపూర్‌ సమీపంలోని ముద్దెనహళ్లిలో స్థిరపడ్డారు. అక్కడే 1861న విశ్వేశ్వరయ్య జన్మించారు. తండ్రి శ్రీనివాసశాస్ర్తి, తల్లి వెంకటలక్ష్మమ్మది సామాన్య కుటుంబం.
 
బాల్యంలోనే విశ్వేశ్వరయ్య తండ్రి మరణించారు. మేనమామ రామయ్య విశ్వేశ్వరయ్యను చేరదీసి బెంగళూరు సెంట్రల్‌ కాలేజీలో చదివించారు. కాలేజీ ఫీజు కోసం విశ్వేశ్వరయ్య ట్యూషన్‌ చెప్తూ 1880లో బీఏలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. గణితంలో ప్రతిభ కలిగిన విశ్వేశ్వరయ్యను మైసూరు రాజ్య దివాన్‌ రంగయ్య గుర్తించి ప్రభుత్వానికి సిఫార్స్‌ చేసి స్కాలర్‌షిప్‌ను ఇప్పించారు. 
 
దాంతో ఆయన పూణే వెళ్లి సివిల్‌ ఇంజనీరింగ్‌ ప్రథమ స్థానంలో పాసయ్యారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా విశ్వేశ్వరయ్యను నియమించింది. మరుసటి ఏడాది ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా ఉన్నతి పొందారు.
 
ఇంజనీర్ గా అంతర్జాతీయ గుర్తింపు 
 
ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్య కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాల్లో ఒక్కటైన సుక్నూర్‌ బరాజ్‌ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమించారు. అద్వితీ యమైన మేధోసంపత్తితో సింధూనది నీటిని సుద్నోరుకు చేరేలా చేశారు. ఆ నీటిని నిల్వ చేయడానికి వినూత్న విధానం కూడా రూపొందించారు. దాహరి దగ్గర నంబనది మీద సైఫన్‌ పద్ధతిన కట్టను నిర్మించారు. 
 
అక్కడ విశ్వేశ్వరయ్య ఆటోమేటిక్‌ గేట్లను నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1906లో ఆడెన్‌ నగరం నీటి సరఫరా ప్రణాళికను రూపొందించారు. ప్రభు త్వం విశ్వేశ్వరయ్యను సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా నియమించింది. కొల్లాపూర్‌, ధార్వాడ, బీజాపూర్‌ తదితర పట్టాణాల్లో మంచినీటి పథకాలను రూపొందించారు. 
 
ఆయన ఆధ్వర్యంలోనే ముసికి వరదలను నివారించేందుకు హుస్సేన్‌సాగర్‌ వంటి నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్‌కు విస్తృత సేవలు అందించారు.స్వరాష్ట్రమైన మైసూర్‌ సంస్థానాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని 1909లో ఆ ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను చీఫ్‌ ఇంజనీర్‌గా నియమించింది. 
 
హెబ్బాళ్‌ వ్యవ సాయ కళాశాల, మైసూర్‌ విశ్వవిద్యాలయం, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, సోప్‌ ఫ్యాక్టరీ, కన్నడ సాహిత్య పరిషత్‌ను విశ్వేశ్వరయ్య నెలకొల్పారు. ఆయన ప్ర జ్ఞతో నిర్మించిన కృష్ణారాజ సాగర్‌తో లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. 1921లో భారత ఉత్పత్తిదారుల సమాఖ్యను నెలకొల్పి జీవితాంతం సమాఖ్య అధ్యక్షునిగా విశ్వేశ్వరయ్య కొనసాగారు. 
 
అవినీతి ఇంజనీర్లను తొలగించి భారతీయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడ్డారు. దివాన్‌ పదవిలో ఉండగా ఎటువంటి ఉద్యోగాలు కోరమని తన బంధువులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పించి వారికి తన సొంత డబ్బులు ఇచ్చి ఇతర వృత్తుల్లో ఉండేలా చేశారు. 
 
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇండియాలో విమాన నిర్మాణం అత్యవసరమైంది. విశ్వేశ్వరయ్య సలహా మేరకు బెంగళూరులో విమాన కార్ఖానా, విశాఖలో నౌకయాన నిర్మాణం ప్రారంభించారు. 90 ఏళ్ల వయస్సులో అప్పటి ప్రధాని నెహ్రూ ఆహ్వానం మేరకు పాట్నా వద్ద గంగానదిపై బ్రిడ్జిని తమ బృందంతో నిర్మించారు. 
 
తుంగభద్ర ప్రాజెక్టు రూపశిల్పి కూడా ఆయనే. తిరుమల మొదటి ఘాట్‌ మార్గానికి 1946లో రూట్‌మ్యాప్‌ రూపొందించిన వ్యక్తి విశ్వేశ్వరయ్య. 1962 ఏప్రిల్‌ 12న మోక్షగుండం దివంగతులయ్యారు.