ఈ నెల 30 నుండి పట్టాలపైకి ‘వందే భారత్ 2’ రైళ్లు

కొత్త ఫీచర్లతో ఆధునికీకరించిన వందే భారత్ రైళ్లు ‘వందే భారత్ 2’ను ఈనెల 30వ తేదీ నుంచి పట్టాల పైకి తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలతో ఈ రైళ్లను ఆధునికీకరించి అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు ప్రకటించింది.

”కొత్త రైళ్లు సీఆర్ఎస్ క్లియెరెన్స్ పొందాయి. పట్టాల మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 30న అహ్మదాబాద్ నుంచి జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది” అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వందే భారత్ కొత్త రైళ్లు మరింత వేగంగా, తేలికపాటి బరువుతో ఉంటాయి. వై-ఫై కనెక్షన్ ఉంటుంది. కేటలిస్టిక్ ఆల్ట్రా వైలట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టం ఏర్పాటు చేశారు.

ఎయిర్ ప్రూరిఫికేషన్ కోరం రూఫ్ మౌంటెడ్ ప్యాకేజ్ యూనిట్ (ఆర్ఎంపీయూ)ను కొత్తగా డిజైన్ చేశారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీలోగా 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రైలు పట్టాల మీదకు రాగానే సాధ్యమైనంత త్వరగా తక్కిన 74 వందే భారత్ రైళ్ల తయారీ ప్రక్రియను చేపట్టాలని అనుకుంటోంది.

మొదటి రెండు, మూడు నెలల్లో ప్రతినెలా 2 నుంచి 3 రైళ్ల తయారీ చేపట్టి, క్రమంగా నెలకు 6 నుంచి 7కు పెంచాలని ఇండియన్ రైల్వే ప్లాన్ చేస్తున్నట్టు మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు.

తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 

కాగా, పర్యటనలు/శిక్షణ/ బదిలీ/ రిటైర్మెంట్ వంటి సమయాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎంచక్కా తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించొచ్చు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ దసరాకు కొద్దిరోజుల ముందు ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై తేజస్ రైళ్లలో ప్రయాణానికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపింది. 

సెమీ హైస్పీడ్ తేజస్- రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ అర్హత శతాబ్ది రైళ్లకు సమానంగా ఉంటుందని వివరించింది. 2017 జులై, 13 నాటి డిపార్ట్‌మెంట్ ఓఎం పేరా 2 A (ii)లో పేర్కొన్న రైళ్లతో పాటు టూర్/ట్రైనింగ్/బదిలీ/రిటైర్‌మెంట్‌ సమయంలో అదనంగా తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అందులో వివరించింది.