భారీగా తగ్గనున్న పామాయిల్ ధరలు!

రానున్న పండుగ సీజన్ నాటికి దేశంలో పామాయిల్ ధరలు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధరలు భారీగా తగ్గటడంతో భారతదేశం ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో పామాయిల్ దిగుమతి చేసుకుంది. జూలై నెలతో పోలిస్తే 2022 ఆగస్టులో పామాయిల్ దిగుమతి 87 శాతం పెరిగింది. 

ఇది 11 నెలల్లో అత్యధికం. అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధరలు 40 శాతం తగ్గాయి. మెట్రిక్ టన్ను పామాయిల్ ధర గరిష్ట స్థాయి 1800-1900 డాలర్ల నుండి 1,000-1100 డాలర్లకు తగ్గింది. ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం ఒకటి.

దానితో దేశంలో వంట నూనెల ధరలు మరింతగా తగ్గేందుకు దారితీసే అవకాశం ఉంది.  అదే సమయంలో, అతిపెద్ద ఉత్పత్తిదారు ఇండోనేషియా నిల్వలను తగ్గించడంలో సహాయం చేస్తుంది.  భారతదేశం జూలైలో 530,420 టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకోగా ఆగస్టులో 994,997 టన్నులు దిగుమతి చేసుకుంది. సెప్టెంబర్‌లో భారతదేశం 1 మిలియన్ టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకోగలదని అంచనా వేస్తు్న్నారు.

పామాయిల్ మిగిలిన ఎడిబుల్ ఆయిల్ కంటే చౌకగా లభిస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీలు పామాయిల్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకున్నాయి. అదే సమయంలో. భారతదేశంలో ప్రస్తుతం పండుగల సీజన్‌. అలా పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో పామాయిల్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. 

ఇకపోతే, పామాయిల్ దిగుమతిపై ప్రభుత్వం 5.5 శాతం పన్ను విధించింది. అదే సమయంలో, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతిపై ప్రస్తుత, వచ్చే సంవత్సరానికి ట్యాక్స్ ఫ్రీ చేసింది.