గోవా మాజీ సీఎంతో సహా బీజేపీలో 8 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు 

మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ తో సహా గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో వారు కాషాయ కండువాలు కప్పుకున్నారు. వారిలో సీఎల్పీ నేత మైఖేల్ లోబో కూడా ఉన్నారు.

వారితో పాటే డెలిలా లోబో, రాజేశ్ ఫల్ దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సియో సీక్వియేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ కూడా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

సీఎల్పీ నేత మైఖేల్ లోబో ఇవాళ ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీని బిజెపిలో విలీనం చేసేలా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని లేఖ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. అనంతరం సీఎం సమక్షంలో బిజెపిలో చేరారు. గోవా అసెంబ్లీలో బిజెపి సొంత బలం 20 నుంచి 28కి పెరిగింది.

గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి ముగ్గురే మిగులుతారని గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద చెప్పారు. మొత్తం మీద 8మంది గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ చేరుతుండటం సంచలనం రేపింది. భారత్ జోడో యాత్ర సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కమలదళంలో చేరుతుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.