సిద్ధూ మూసేవాలా హత్యలో ఉగ్రవాదం.. 60 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యతో సంబంధం ఉన్న అనుమానిత ఉగ్రవాద ముఠాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. అందులో భాగంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లోని 60 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దులో నిందితుడు షూటర్ దీపక్ ముండితో పాటు అతని ఇద్దరు సహాయకులను అరెస్టు చేశారు.

దీంతో సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల సంఖ్య 23కు చేరుకుంది. ఈ నిందితులు నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఈ ఇద్దరు వ్యక్తులను కపిల్ పండిట్, రాజిందర్ అలియాస్ జోకర్‌గా గుర్తించారు.

ఢిల్లీ పోలీసులు, సెంట్రల్ ఏజెన్సీలతో పాటు పంజాబ్ పోలీసుల యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (ఎజిటిఎఫ్) సంయుక్తంగా కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. కాగా, ఈ ఏడాది మే 29న సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. కొందరు దుండగులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్య వెనుక ప్రధాన సూత్రధారి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయేనని పోలీసులు వెల్లడించగా.. మరో ఆరుగురిపై ఆరోపణలు వచ్చాయి. అందులో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశారు.

ఇద్దరు పోలీస్ ఎన్ కౌంటర్లో మృతి చెందగా, పరారీ ఉన్న ఆఖరి వ్యక్తి దీపక్ ను ఇటీవలే పోలీసులు పట్టుకున్నారు. సిద్ధూ మూసే వాలా హత్య కేసులో గ్యాంగస్టర్లకు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ చెప్పారు. నీరజ్ షేరావత్ అలియాస్ నీరజ్ బవానా గ్యాంగ్ ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుందని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.

నీరజ్ బవానా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగులకు మధ్య యుద్ధం సాగుతుందని దర్యాప్తులో తేలింది.  దేశంలో గ్యాంగ్ స్టర్లు జైళ్లలో నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని ఎన్ఐఏ అధికారుల సోదాల్లో వెల్లడైంది.

భారతదేశంతో పాటు కెనడా, పాకిస్థాన్, దుబాయ్ దేశాల్లోని జైళ్లలో ఉన్న గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డియా బ్రార్, విక్రం బ్రార్, జగ్గు భగవాన్ పురియా, సందీప్, సచిన్ తాపన్, అనమోల్ బిష్ణోయ్ లు వారి గ్యాంగుల కార్యకలాపాలను లోపల నుంచి సాగిస్తున్నారని ఎన్ఐఏ అధికారుల సోదాల్లో తేలింది. 

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఖలీస్థానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రింధాకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని దర్యాప్తులో వెల్లడైంది. తీహార్, హర్యానా జైళ్లలో ఉన్న కౌషల్ చౌదరి, లక్కీ పాటియాల్, లారెన్స్ బిష్ణోయ్, బాంబిహా గ్యాంగ్ లపై కూడా యూఏపీఏ కింద కేసులు పెట్టాలని ఎన్ఐఏ నిర్ణయించింది.