రామ్ లీలా మైదానం నుంచి ప్రారంభమైన సంజయ్ పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం సూరారం కాలనీలోని రామ్ లీలా మైదానం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున కుత్బుల్లాపూర్ బీజేపీ శ్రేణులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కాసేపట్లో సుభాష్ నగర్ బస్ డిపో వద్ద బీజేపీ జెండాను సంజయ్ ఆవిష్కరింఛాయారు. అంతకుముందు సంజయ్ హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరి గాజులరామారంలోని చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ తర్వాత ర్యాలీగా వెళ్లి సూరారంలోని కట్ట మైసమ్మ ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుత్బుల్లాపూర్ లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి కేసీఆర్ దేశాన్ని పట్టుకుని తిరుగుతున్నాడని సంజయ్ ధ్వజమెత్తారు. 

కేసీఆర్ బీఆర్ఎస్ కాదు.. ప్రపంచ రాష్ట్ర సమితి (పీఆర్ఎస్) పెట్టుకుని కేఏ పాల్ తో కలిసి తిరిగినా ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులను అవమానపరిచే విధంగా అస్సాం సీఎం విషయంలో టిఆర్ఎస్ వ్యవహరించిందని మండిపడ్డారు.  ముగ్గురి కబంధ హస్తాలలో బందీ అయి రోదిస్తున్న తెలంగాణ తల్లికి విముక్తి కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టామని సంజయ్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ ను న్యూయార్క్, సింగపూర్ స్థాయిలో అభివృద్ధి చేస్తానన్న సీఎం కేసీఆర్.. అది ఎక్కడైందో చూపించాలని  డిమాండ్ చేశారు. చిన్న వర్షం కురిస్తే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి ఉందని అంటూ సిటీలో గుంత చూపిస్తే వెయ్యి ఇస్తానన్నా కేసీఆర్ కు.. సిటీలో ఉన్న గుంతలను చూపిస్తే ఇవ్వడానికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు.

పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, రైతుల రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 సంవత్సరాలు అయినా డ్రైనేజీలను మార్చలేదని పేర్కొంటూ ‘జీడిమెట్ల నీళ్లు పంపుతా కేసిఆర్ స్నానం చెయ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినం పేరుతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 30 గ్రామాల కరెంటుని కెసిఆర్ తన ఫామ్ హౌస్ లోకి వాడుకున్నాడని ఆరోపించారు.  

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే కరెంట్ కట్ చేసేలా  కేంద్రం విద్యుత్ బిల్లును రూపొందించిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడివో పాత పేపర్లను, చిత్తు కాగితాలను పట్టుకుని పవిత్రమైన అసెంబ్లీని కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు.

అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిందంతా అబద్దమని నిరూపించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.‘‘కేసీఆర్… ఇదిగో కేంద్ర విద్యుత్ బిల్లు… నీకు పంపిస్తున్నా. చదువుకో. నీకే గనక పౌరుషం ఉంటే తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయ్. పవిత్రమైన అసెంబ్లీనే తప్పుదోవ పట్టించిన నువ్వు వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ నేను చెప్పేది తప్పయితే రాజీనామాకు సిద్ధం”అని సవాల్ విసిరారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ విస్మరించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాలన చేతకాకనే.. కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని పేర్కొంటూ  దళితులను దగా చేసిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయన సర్కార్‌కు మీటర్లు పెట్టి అవినీతిని కక్కిస్తామని స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలను కలిపేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను మించిన అవకాశవాది మరొకరు లేరని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

 కేసీఆర్ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణది నాలుగో స్థానం కాగా.. సైబర్ క్రైం, దోపిడీల్లో నంబర్ వన్ స్థానంలో ఉందని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. వైద్య ఆరోగ్యశాఖ చేతకాని‌ తనంతోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయారని విమర్శించారు. వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో తెలంగాణ ఉండడం దురదృష్టకరమని చెప్పారు.  

కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు బిజినెస్ పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ తోక‌పార్టీగా మారిందని పేర్కొంటూ అవినీతి పార్టీలతో ఏకమై‌ కేసీఆర్ కూటమి కడుతుతున్నారని ధ్వజమెత్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొదలైన నాలుగో విడత పాదయాత్ర ఈ నెల 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగియనుంది.

10 రోజుల పాటు 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నందున ఆ రోజున పాదయాత్ర ఉండదు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్–కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.