రాత్రిపూట పబ్ లు ఎటువంటి సౌండ్ పెట్టరాదన్న తెలంగాణ హైకోర్టు 

రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఎటువంటి సౌండ్ పెట్టరాదని ఆదేశిస్తూ  హైదరాబాద్ లోని పబ్స్ పై  తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు సోమవారం నుండే  అమలు చేయాలని స్పష్టం చేసింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఇవ్వాలని సూచించింది. రాత్రి సమయాల్లో ఎలాంటి సౌండ్ సిస్టమ్స్ కు అనుమతి లేదని పేర్కొంది.

 నగరంలోని జనావాసాల మధ్య పబ్‌ల నిర్వహణ అంశంపై జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. డిజె సౌండ్‌లు, మితిమీరిన సౌండ్ తో నృత్యాల వల్ల చుట్టుపక్కలవాళ్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని గతంలో అనేక సందర్భాల్లో స్థానిక పోలీసుల నుంచి డిజిపి, ప్రభుత్వానికి అనే క ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. 

ఈక్రమంలో జనావాసాల సమీపంలో ఉండే పబ్‌లలో ధ్వని నిబంధన ఉల్లంఘించిన పబ్‌లపై నమోదైన కేసుల గురించి ఆరా తీసింది. ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. నివేదిక సమర్పించాలంటూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ నగర పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. 

పబ్‌లలో మ్యూజిక్, డ్యాన్సులకు అనుమతుల గురించి తెలపాలని సూచించింది. పబ్‌లకు లైసెన్స్ మంజూరు చేసేటప్పుడు పరిగణించిన అంశాలేంటో తెలపాలని జిహెచ్‌ఎంసికి ఆదేశించింది. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఇల్లు, విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్ లకు ఎలా అనుమతి ఇచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది.

పబ్ లో రాత్రి పూట కేవలం లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని నిర్దేశించింది. ఇటీవల టాట్ పబ్ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో పిటిషనర్ల తరపున హైకోర్టు న్యాయవాది కైలాష్ నాథ్ వాదించారు. విచారణ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.