సోనాలి ఫోగట్ కేసు ఇక సిబిఐకి

హర్యానా బిజెపి నాయకురాలు, నటి సోనాలి ఫోగట్(43) కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి తన ప్రభుత్వం అప్పగించనున్నదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం ప్రకటించారు.  ఈ కేసులో గోవా పోలీసులు అద్భుతమైన దర్యాప్తు చేశారని, అనేక అంశాలను వెలుగులోకి తెచ్చారని ఆయన కొనియాడారు.
అయితే, హర్యానా ప్రజలు, మృతురాలి కుమార్తె డిమాండ్ మేరకు సీబీఐకు అప్పచెప్పాలని నిర్ణయించినట్లు చెప్పారు.  ‘మేము కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించుకున్నాము. ఆమె కూతురు కూడా సిబిఐ విచారణను కోరుకుంది. సిబిఐతో దర్యాప్తు జరిపించమని కోరుతూ నేను వ్యక్తిగతంగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు లేఖ వ్రాస్తాను’ అని ఆయన తెలిపారు. 
 
సోనాలి ఫోగట్ మరణం కేసును హత్య కేసుగా పరిగణిస్తున్నామని కూడా ఆయన తెలిపారు. ఆగస్టు 22-23 మధ్య రాత్రి ఆమె అనూహ్యంగా మరణానికి గురయిందని పేర్కొన్నారు. ఆమె పర్సనల్ అసిస్టెంట్ సుధీర్ సాంగ్వాన్, అతడి సహచరుడు సుఖ్వీందర్ సింగ్ కలిసి ఆమెకు డ్రగ్స్ బలవంతంగా ఇచ్చి మరీ చంపారన్నది ఆరోపణ. ప్రస్తుతం ఆ నిందితులిద్దరూ పోలీసు కస్టడీలోనే ఉన్నారు.
 
 సోనాలి ఫోగట్ మృతి కేసులో సెప్టెంబర్ 23లోగా సీబీఐ విచారణకు సిఫారసు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హర్యానా ప్రభుత్వానికి ‘సర్వ్ జాతీయ ఖాప్ మహాపంచాయత్’ ఆదివారం అల్టిమేటం ఇచ్చింది. ఫోగట్ టీనేజ్ కుమార్తె యశోధర, ఇతర కుటుంబ సభ్యులు కూడా మహాపంచాయత్‌లో పాల్గొన్నారు. 
ఈ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణకు ఆదేశించడంలో ప్రభుత్వం విఫలమైతే సెప్టెంబర్ 24న అలాంటి మరో కౌన్సిల్‌ను పిలవాలని మహాపంచాయత్ నిర్ణయించింది. మహాపంచాయత్‌లో 15 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు, ఇందులో ఫోగట్ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు కూడా ఉన్నారు.
మహాపంచాయత్‌లో మాట్లాడుతున్నప్పుడు, యశోధర చేతులు జోడిస్తూ “నా తల్లికి న్యాయం చేయడానికి నాకు మద్దతు ఇవ్వండి” అని విజ్ఞప్తి చేస్తూ, సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఆమెకు అండగా ఉంటామని ప్రజలు చేతులెత్తి హామీ ఇచ్చారు.