జ్ఞానవాపి మసీదు కేసులో హిందువుల పిటిషన్‌ స్వీకరించిన కోర్టు

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో దేవతా విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ హిందువుల తరఫు దాఖలైన పిటిషన్‌ను వారణాసి డిస్ట్రిక్స్ట్ అండ్ సెషన్స్ కోర్టు సోమవారంనాడు విచారణకు స్వీకరించింది. హిందువుల పిటిషన్‌ను సవాలు చేస్తూ ముస్లిం వర్గాలు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.  తదుపరి విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.
”పిటిషన్‌ను విచారణకు యోగ్యమైనదిగా భావిస్తూ ముస్లింల తరఫు వాదనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22న జరుగుతుంది” అని హిందువుల తరఫు కోర్టుకు హాజరైన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. ముస్లిం పిటిషనర్లు తదుపరి అప్పీల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని పిటిషనర్ సోహన్ లాల్ ఆర్య మీడియాకు తెలిపారు.
 మతపరమైన సున్నితమైన అంశంలో జిల్లా న్యాయమూర్తి ఎకె విశ్వేష్ గత నెలలో ఉత్తర్వులను సెప్టెంబర్ 12 వరకు రిజర్వ్ చేశారు. జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతలను ప్రతిరోజూ పూజించేందుకు అనుమతి కోరుతూ ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు.
మసీదు ప్రాంగణంలో విగ్రహాల విషయమై విచారణే అవసరం లేదని, దీనిపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని అంజుమన్ ఇంతెజామియా కమిటీ అఫిడవిట్ దాఖలు చేసింది. మసీదుకు సంబంధించిన స్థలం సహా మిగిలిన ఆస్తులు పూర్తిగా వక్ఫ్ బోర్డుకు చెందుతాయని పేర్కొంది. మరోవైపు మసీదు కాంప్లెక్స్ లోని హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు పిటిషన్ వేశారు.

ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని హిందూ తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ఈ కేసును విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది. అయితే అది శివలింగం కాదని మసీద్ కమిటీ వాదిస్తూ వస్తోంది.

ఈ క్రమంలో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరి, తిరిగి వారణాసికే చేరింది. వీడియో రికార్డింగ్ కు సంబంధించిన ఫుటేజీలు లీక్ కావడంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో ఇవాళ వెలువడిన తీర్పు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

గతంలో, దిగువ కోర్టు కాంప్లెక్స్‌ను వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించింది. మే 16న సర్వే పనులు పూర్తి చేసి మే 19న కోర్టులో నివేదిక సమర్పించారు. కాగా, జ్ఞానవాపి-శ్రింగార్ గౌర్ కేసులో సోమవారం కోర్టు ఆదేశాలు ఇవ్వనుందనే కారణంగా ముందస్తుగా వారణాసిలో నిషేధ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చారు. భద్రతను కట్టుదిట్టం చేశారు లక్నో పోలీసులు వారణాసిలో ఫ్లాగ్ మార్చ్ జరిపారు.