అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రూ.1,800 కోట్లు

అయోధ్య నగరంలో రామాలయం నిర్మాణం కోసం రూ.1800కోట్లను వెచ్చించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు తాజాగా నిర్ణయించింది. ఈమేర ఆదివారం ఫైజాబాద్ సర్క్యూట్ హౌసులో జరిగిన శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు సమావేశంలో ఆలయ నిర్మాణ వ్యయానికి ఆమోదం తెలిపింది.
హిందూ సంప్రదాయాల ప్రకారం విగ్రహాల ఏర్పాటుకు ట్రస్టు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
అయోధ్య రామాలయం నిర్మాణం కోసం రూ.1800 కోట్లతో నిపుణులు రూపొందించిన ప్రణాళికను ట్రస్టు సభ్యులు ఆమోదం తెలిపారు.  భక్తుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని ట్రస్టు రామాలయం నిర్మాణం కోసం మార్గదర్శకాలను రూపొందించిందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. రాముడి విగ్రహం నిర్మాణంలో తెల్లని పాలరాయిని ఉపయోగించాలని ట్రస్ట్ నిర్ణయించింది.
రామాయణం నాటి అనేక ఇతర దేవతల విగ్రహాలు కూడా రామాలయం వద్ద వస్తాయి. ఆలయ సముదాయంలో ప్రముఖ హిందూ దర్శనీయుల విగ్రహాల కోసం స్థలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్మాణం ప్రారంభమైన రెండేళ్ల తర్వాత 40 శాతం నిర్మాణ పనులు పూర్తయినట్లు రెండు వారాల క్రితం తెలిపారు.
ఈ ట్రస్టు సమావేశంలో నిర్మాణ కమిటీ ఛైర్మన్ నుపేంద్ర మిశ్రా, ట్రస్టు ఛైర్మన్ నృత్య గోపాల్ దాస్, కార్యదర్శి గోవింద్ దేవ్ గిరి, విశ్వతీర్థ ప్రసన్నాచార్య, డాక్టర్ అనిల్ మిశ్రా, దీనేంద్ర దాస్, కామేశ్వర్ చౌపాల్, జిల్లా కలెక్టర్ నితీష్ కుమార్ లు పాల్గొన్నారు. మొత్తం 15 మంది ట్రస్ట్ సభ్యులలో 14 మంది పాల్గొన్నారు.
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రామాలయ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 జనవరి మకర సంక్రాంతి నాటికి రాముడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని ట్రస్టు సభ్యులు నిర్ణయించారు.