ప్రతి 44 సెకన్లకు ఒక కరోనా మరణం

ప్రతి 44 సెకన్లకు ఒక కరోనా మరణం నమోదు అవుతోందని, కరోనా మహమ్మారి మానవాళిని పూర్తిగా విడిచిపెట్టలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) ఆయా దేశాల్ని హెచ్చరించింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా,  పపంచంలో ఇప్పటికీ ప్రతి అర నిమిషానికి ఒకరు వైరస్‌ కారణంగా చనిపోతున్నారని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కార్యదర్శి అథనోం గేబ్రియెసెస్‌ తెలిపారు. 
 
‘కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా, మరణాలు మాత్రం అదేస్థాయిలో ఉన్నాయి. వైరస్‌ ప్రభావంపై వస్తున్న నివేదికలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఇదే ట్రెండ్‌ ఇకపై ఉంటుందని గట్టిగా చెప్పలేం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కరోనా మరణాల సంఖ్య 80 శాతం వరకు తగ్గాయి. ఇలాంటి పరిస్థితిలోనూ ప్రతి 44 సెకన్లకు ఒక వ్యక్తి కరోనాతో చనిపోతున్నాడు. ఇది అత్యంత ప్రమాదకర సంకేతం” అని ఆయన తెలిపారు. 
 
కరోనా మరణాలను అడ్డుకోవచ్చునని చెబుతూ జాగ్రత్తలు కొనసాగించాలని ఆయా దేశాల పౌరులకు ఆయన సూచించారు. ”కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు..పోలేదు..పోలేదు అని పదే పదే చెబుతున్నాను. ఈ మాట నా నుంచి విని..విని…మీరు విసిగి చెంది వుండొచ్చు. వైరస్‌ పూర్తిగా మనల్ని విడిచిపోలేదు అనేందుకు కచ్చితమైన సమాచారముంది” అని గేబ్రియెసెస్‌ హెచ్చరించారు.
 
ఇప్పడు నెలకొంటున్న కేసులు, సెకండ్ల వారిగా దీని ప్రభావంతో మరణాలు తిరిగి కరోనా ఉధృతిని సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వైరస్ పట్ల ప్రజలలో నిర్లక్ష ధోరణి పెరగడం ఇప్పటికీ సంభవిస్తున్న మరణాల రేటును తెలియచేస్తోందని, నిజానికి మరింతగా టీకాల కార్యక్రమం సమగ్రరీతిలో జరిగితే, జనమంతా తగు టీకా డోసులు పొందితే ఈ విషాదాంతాలను అరికట్టవచ్చునని తెలిపారు. 
 
 ఓ విధంగా ఇవి అవాంఛనీయ, చేజేతులా కొని తెచ్చుకునే మరణాలే అవుతాయని స్పష్టం చేశారు. మహమ్మారిని ఎదుర్కోవటంపై అనుసరించాల్సిన వైద్య విధానంపై డబ్ల్యూహెచ్‌వో త్వరలో ఒక ప్రకటన చేయనున్నది. వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంతగా అడ్డుకోవాలని ఆయా దేశాల్ని డబ్ల్యూహెచ్‌వో కోరుతోంది.
 మంకీపాక్స్ ప్రమాదకర స్థితినే తెచ్చిపెట్టిందని పేర్కొంటూ ఇటీవల అమెరికాలో కేసుల సంఖ్య తగ్గిందని అయితే ఎప్పుడు కేసులు పెరుగుతాయనేది తెలియదని తెలిపారు. ఏ వైరస్‌కు అయినా తగ్గుముఖ పరిస్థితి ముప్పునకు దారతీస్తుందని చెప్పిన డబ్లుహెచ్‌ఒ డిజి దీనిపై వివరణ ఇస్తూ అంతా సద్దుమణిగిందని నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటే తిరిగి వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, ఇది కరోనాకు వర్తిస్తుందని తెలిపారు.