భారతదేశం నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహిస్తుంది

భారతదేశం నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.  గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో శనివారం ప్రారంభమైన రెండురోజుల కేంద్ర- రాష్ట్రాల సైన్సు సదస్సును వీడియో లింక్‌ ద్వారా ప్రధాని ప్రారంభించారు.
 
 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో వైజ్ఞానిక, శాస్త్ర సాంకేతిక, పరిశోధన, ఇన్నొవేషన్‌ రంగాల్లో  గట్టి కృషిని కొనసాగించడానికి తొలిసారి ఏర్పాటుచేసిన సదస్సు ఇది. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలు, యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తల భాగస్వామ్యాన్ని అందిపుచ్చుకోవచ్చని చెప్పారు
 
భారతదేశ సైన్స్ అభివృద్ధికి, ఈ రంగానికి సంబంధించిన వ్యక్తుల పాత్ర చాలా ముఖ్యమైనది చెప్పుకొచ్చారు.మన శాస్త్రవేత్తల విజయాలను మనం సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. మన శాస్త్రవేత్తలను, వారి ఆవిష్కరణలను తెలుసుకున్నప్పుడే సైన్స్ మన సంస్కృతిలో భాగమవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. 
 
భారత్‌ను పరిశోధన, సృజనాత్మక రంగాల్లో ప్రపంచ కేంద్రంగా మలిచేందుకు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ దిశగా నవ్య విధానాలను శాస్త్ర సాంకేతిక రంగాల్లో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.‘జై జవాన్‌- జై కిసాన్‌- జై విజ్ఞాన్‌’ నినాదానికి ఇప్పుడు ‘జై అనుసంధాన్‌’ జత కలిసిందని మోదీ చెప్పారు.
 
సైన్స్ ఆధారిత అభివృద్ధి దృక్పథంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా  ప్రధాని తెలిపారు. 2014 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెరిగాయని, ప్రభుత్వ కృషి కారణంగా, భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 2015లో 81వ స్థానం నుంచి 46వ స్థానానికి చేరామని ఆయన గుర్తు చేశారు. 
 
నేటి యువత సాంకేతికతకు త్వరగా అలవాటు పడుతున్నారని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.  శాస్త్రవేత్తలకు భారత దేశంలో కొదవలేదని చెబుతూ ఈ అమృత్ కాల్‌లో మనం భారతదేశాన్ని పరిశోధన, ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘సెంటర్- స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్’ మన ‘సబ్ కా ప్రయాస్’ మంత్రానికి ఉదాహరణ అని ప్రధాని మోదీ  చెప్పారు.