రాహుల్ బాబా… ముందు భారత దేశ చరిత్ర చదవండి

“రాహుల్ బాబా… మొదట భారత దేశ చరిత్రను అధ్యయనం చేయండి” అంటూ `భారత్ జోడో యాత్ర’ నిర్వహిస్తున్న కాంగ్రెస్  నేత రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా సలహా ఇచ్చారు.  రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన శనివారం మాట్లాడుతూ “రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. అయితే అతను మొదట మన దేశ చరిత్రను అధ్యయనం చేయాలని నేను భావిస్తున్నాను.” అని చెప్పారు. 
 
అక్కడి తో ఆగకుండా, రాహుల్ బాబాకు, కాంగ్రెస్ సభ్యులకు పార్లమెంట్‌లో ఆయన చేసిన ప్రసంగాన్ని గుర్తు చేశారు.  “ఓయ్ రాహుల్ బాబా, భారత్ ఒక దేశంగా లేదని ఏ పుస్తకంలో చదివావు? పార్లమెంటులో అదేగా నీవు ప్రసంగించావు. ఈ దేశం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు.” అని అమిత్ షా ప్రశ్నించారు. 
 
రాహుల్ గాంధీ భారత దేశాన్ని కనెక్ట్ చేయడానికి వెళ్ళారని, అయితే ఆయన మొదట భారత దేశ చరిత్రను అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. విదేశీ టీ-షర్ట్, జెర్సీ ధరించి, భారత దేశాన్ని కలిపే యాత్రకు వెళ్ళారని గాంధీని ఎద్దేవా చేశారు. 
 
కాంగ్రెస్ దేశాభివృద్ధికి పనిచేయదని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రం చేయగలదని ఆయన విమర్శించారు. రాజస్థాన్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక కాంగ్రెస్ దిక్కులేకుండా పోతుందని స్పష్టం చేశారు. 
 
ఉదయపూర్ టైలర్ కన్హయ్య లాల్‌ను ముస్లిం తీవ్రవాదులు హత్య చేయడం,యు కరౌలీ హింసపై రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విరుచుకుపడ్డారు.  కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకు మరియు బుజ్జగింపు రాజకీయాలను మాత్రమే చేయగలదని ఆరోపించారు. 
 
రాజస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదలపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై హోం మంత్రి విరుచుకుపడ్డారు, కేంద్రం పన్ను రేట్లను తగ్గించినప్పటికీ ఇక్కడి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించలేదని ధ్వజమెత్తారు. ‘‘ఇటీవల పెట్రోలుపై ప్రధాని పన్ను తగ్గించారు, బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా తగ్గించాయి. కానీ అశోక్ గెహ్లాట్ చేయలేదు. దేశంలోనే అత్యంత ఖరీదైన పెట్రోల్, డీజిల్ నేడు రాజస్థాన్‌లో విక్రయిస్తున్నారు. అత్యంత ఖరీదైన విద్యుత్ అందుబాటులో ఉంది. రాజస్థాన్‌లో ఎవరు బాధ్యులు?” అని ప్రశ్నించారు. 
 
“గెహ్లాట్ సాహబ్ జోధ్‌పూర్‌కు చెందినవారు. నేను ఆయన గ్రామానికి వచ్చాను… గెహ్లాట్ జీ, జాగ్రత్తగా వినండి, మీ వాగ్దానాలు, రాహుల్ బాబాతో మీరు చేసిన నిరాధారమైన వాగ్దానాలను మీకు గుర్తు చేయడానికి వచ్చాను. ఐదేళ్లు పూర్తవుతున్నాయి, బీజేపీ మీ హిసాబ్ అడుగుతోంది’’ అని హోంమంత్రి పేర్కొన్నారు. 
 
జోధ్‌పూర్ సీఎం గెహ్లాట్ సొంత జిల్లా, గతంలో ఆయన నగరం నుంచి ఐదు సార్లు ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం గెహ్లాట్ జోధ్‌పూర్‌లోని సర్దార్‌పురా నియోజకవర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తన ప్రసంగానికి ముందు,  పార్టీ ఓబిసి మోర్చా రెండు రోజుల జాతీయ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు.