కాంగ్రెస్ ను గాంధీ కుటుంభ  పార్టీగా ఉంచేందుకే ”భారత్ జోడో యాత్ర”

కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంభ పార్టీగా కాపాడుకునేందుకే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ”భారత్ జోడో యాత్ర” ను చేపట్టారని బిజెపి ఎద్దేవా చేసింది. ఈ యాత్ర కుటుంబ పరిరక్షణ ప్రచారం మాత్రమే అని స్పష్టం చేస్తూ దాని వల్లన ప్రజలకు ఒరిగిందేమీ లేదని తేల్చి చెప్పింది. 
”ఇది రాహుల్ గాంధీని నేతగా నిలబెట్టే ప్రయత్నం” అని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సొంత పార్టీని ఐక్యంగా ఉంచడం రాహుల్ వల్ల కాదని, ఆయన తరుచు విదేశాలకు వెళ్లిపోతుంటారని, ఆయనకే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించాలనే వంతపాట నడుస్తుంటుందని చెప్పారు.
కుటుంబ పరిరక్షణ ప్రచారం కోసం అనివార్యంగా చేపట్టిన యాత్ర ఇదని పేర్కొన్నారు. ”అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున గాంధీల ఫ్యామిలీతో పార్టీ విస్తరణ మునుగిపోతున్న నౌకలా మారింది. ఇదేమీ దేశ ఐక్యత కోసం చేపట్టిన ప్రయత్నం కాదు. రాహుల్‌ను నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం. ఆయనను ఎన్నిసార్లు నాయకుడిగా నిలబట్టే ప్రయత్నం జరగలేదు?” అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
గులాం నబీ ఆజాద్ సహా ఇటీవల కాలంలో పలువురు నాయకులు పార్టీని వీడిపోతుండటంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, పార్టీని ఆయన (రాహుల్) ఐక్యంగా ఉంచలేకపోతున్నారని  గుర్తు చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత సాయుధ బలగాలు దాడులు జరిపితే ఆయన సాక్ష్యాలు అడిగారని, కరోనా  సమయంలో లాక్‌డౌన్‌ను ప్రశ్నించారని, ఇలా ప్రతిసారి దేశ ఐక్యతను బలహీన పరచేందుకే ఆయన పనిచేశారని విమర్శించారు.
దేశ ఐక్యత విషయంలో ఆయన రికార్డు చాలా బలహీనంగా ఉందని, ఇప్పుడు ఐక్యత అంటూ టూర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాత్ర వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదనే విషయం యావద్దేశానికి తెలుసునని చెప్పారు. కాగా, కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ శతబ్దంలోనే పెద్ద కామెడీ అని బీజీపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఓ ట్వీట్‌లో ఎద్దేవా చేశారు.
 
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం  కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఈ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు  పాల్గొన్నారు. రోజుకు సగటున 25 కిలోమీటర్లు రాహుల్ నడవనున్నారు.150 రోజుల (5 నెలలు)  పాటు 3,570 కిలోమీటర్ల మేర.. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది.