నాసల్ వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతి

నాసల్ వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతి
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ నాసల్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలో అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపింది. 
 
భారత్ బయోటెక్ సంస్థ ఈ నాసల్ వ్యాక్సిన్ ను ఇప్పటికే 4 వేల మంది వలంటీర్లపై పరీక్షించింది. క్లినికల్ ట్రయల్స్ లో నాసల్ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇవ్వగా, ఎక్కడా దుష్పరిణామాలు నమోదు కాలేదు. చింపాంజీ అడినోవైరస్ వెక్టార్ కు కొన్ని మార్పులు చేసి ఈ ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది.
 
కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ, భారత్ బయోటెక్ కరోనా నాసల్ వ్యాక్సిన్ కు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) ఆమోదం తెలిపిందని వెల్లడించారు.  దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు లభించాయని వివరించారు. 
 
కరోనా మహమ్మారిపై భారత్ సాగిస్తున్న పోరాటాన్ని ఈ వ్యాక్సిన్ మరింత ముందుకు తీసుకెళుతుందని మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనాపై పోరాటంలో భారత దేశం తన సైన్స్, పరిశోధన, అభివృద్ధి మానవ వనరులను వినియోగించిందని చెప్పారు. సైన్స్ చోదక వైఖరితో, అందరి కృషితో ఈ మహమ్మారిని ఓడిస్తామని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 
 
భారత్‌లో అనుమతి పొందిన తొలి ఇంట్రానాసల్‌ కోవిడ్‌ టీకాగా భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌ నిలిచింది. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.ఈ టీకా పూర్తిగా సురక్షితమైనదని, వ్యాధినిరోధక శక్తిని సమర్థవంతంగా ప్రేరేపిస్తుందని గత నెలలో వెలువరించిన మూడోదశ ప్రయోగ ఫలితాల సందర్భంగా భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.  
కొద్దిపాటి మార్పులు చేసిన చింపాంజీ అడినోవైరస్‌ వెక్టార్‌ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు సంస్థ తెలిపింది. సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా టీకా అభివృద్ధి చేసినట్లు వివరించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.
ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు మంజూరు కావడంపై భారత్‌ బయోటెక్‌ సంస్థ ఎండీ కృష్ణా ఎల్లా సంతోషం వ్యక్తంచేశారు. గ్లోబల్‌ గేమ్‌ ఛేంజర్‌ అయిన తమ చుక్కల మందు ఇన్‌కోవాక్‌కు అనుమతులు లభించడంపై గర్వంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో సంభవించే అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు నాసల్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పారు.