రైతులందరికీ ఉచిత విద్యుత్… కేసీఆర్ హామీపై బిజెపి ఎద్దేవా

దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తానంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విభాగం ఇన్ చార్జి అమిత్ మాలవీయ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘తెలంగాణలోని రెండు డిస్కంలు (విద్యుత్ పంపిణీ కంపెనీలు) రూ.11,935 కోట్ల అప్పుల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని ఒక విద్యుత్ ఉత్పత్తి కంపెనీకి కూడా రూ.7,388 కోట్ల అప్పుల్లో ఉంది.  సొంత రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి,  పంపిణీ సంస్థలే అప్పుల్లో ఉన్నప్పుడు.. యావత్ దేశానికి ఉచిత కరెంట్ ఇస్తాననడం కేసీఆర్ కే చెల్లింది’’ అని ఆయన ట్విట్టర్  వేదికగా ఎద్దేవా చేశారు. 

ఈ మేరకు విశ్లేషణతో ఓ జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన కథనం తాలూకూ వీడియోను తన ట్వీట్ కు జత చేశారు. ‘‘కేసీఆర్ ఒక విఫల ముఖ్యమంత్రి. ఆయన ముందుగా తెలంగాణపై ఫోకస్ చేస్తే బాగుంటుంది’’ అని అమిత్ మాలవీయ సూచించారు. 2024లో కేంద్రంలో బీజేపీయేతర సర్కారు ఏర్పడితే.. దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్ ను అందిస్తామని కేసీఆర్ ఇటీవల నిజామాబాద్ బహిరంగ సభలో ప్రకటించారు. 

 కాగా,ముందు రాష్ట్రంలో  అందరికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. జాతీయ రాజకీయాల పేరుతో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేసీఆర్ ను అక్కడి నాయకులెవరూ పట్టించుకోలేదని అంటూ రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి పర్యటనల పేరుతో  ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు.

 రాష్ట్రంలో ఉన్న సమస్యలను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఇటువంటి హామీలు ఇస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలు అమలు చేసి.. ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళొచ్చని హితవు చెప్పారు. పేకాట, లిక్కర్ స్కాం సహా.. అన్ని ఈడీ కేసుల్లో కేసీఆర్ పుత్ర రత్నాలున్నారని ఆరోపిస్తూ, కొడుకు, కూతురు అక్రమ సంపాదన చూసి కేసీఆరే షాక్ అవుతున్నారట అని ఎద్దేవా చేశారు.