రాజాసింగ్ పై పిడి యాక్ట్ ను హైకోర్టులో సవాల్ చేసిన భార్య

 గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య ఉషాభాయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న మంగళ్‌‌‌‌హాట్‌‌‌‌ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసు ఆధారంగా గత నెల 25న రాజాసింగ్‌ను పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.  ఆ రోజున ఆయనను అరెస్టు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. రాష్ట్రంలోనే తొలిసారి ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ప్రయోగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.  దీన్ని సవాల్‌ చేస్తూ ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు.

 హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్‌‌‌‌పై  పెట్టిన  పీడీ యాక్ట్ ను ఎత్తివేసి..  బెయిల్ ను మంజూరు చేయాలని పిటిషన్ లో ఆమె  విజ్ఞప్తి చేశారు. ఈ  పిటిషన్ ను విచారించిన హైకోర్టు మంగళ్ హాట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్ హెచ్ ఓ)  కు నోటీసులు జారీ చేసింది.  రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.

రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్‌ను అక్రమంగా నిర్బంధించారని ఆమె పేర్కొన్నారు. లా అండ్‌ ఆర్డర్‌కు భంగం కలిగిస్తున్నారని చెప్పి పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేయడానికి వీలుగా గత నెల 26న జీవో 1651ను జారీ చేశారని చెప్పారు. కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేయడం అన్యాయమని ఆమె తెలిపారు.

పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేసే ముందుకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఎ నోటీసు ఇవ్వాలని, ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41ఎ నోటీసు ఇవ్వాలన్న నిబంధనను పోలీసులు ఉల్లంఘించారని ఆమె  చెప్పారు. రాజాసింగ్‌కు ఆ విధమైన నోటీసు ఇవ్వకుండా అరెస్ట్‌ చేసినందున రిమాండ్‌కు పంపేందుకు కింది కోర్టు అంగీకరించలేదని ఆమె గుర్తు చేశారు. ‘కొందరి’ని సంతృప్తి పరిచేందుకే రాజాసింగ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆమె ఆరోపించారు.

 ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై 2004 నుంచి ఇప్పటివరకు మొత్తం 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. మొత్తం 101 కేసుల్లో.. 18 కమ్యూనల్ కేసులేనని తెలిపారు.  ఆగస్టు 22న ‘‘శ్రీరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలంగాణ’’లో మహ్మద్ ప్రవక్తపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. ఆ వీడియోను సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో సర్క్యులేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారనే అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.