వర్ధన్నపేట ఎస్టీ బాలికల వసతి గృహంలో ఆహార కాలుష్యం

వ‌రంగ‌ల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎస్టీ బాలికల వసతి గృహంలో చదువుతున్న 60 మందికి పైగా విద్యార్థులు సోమవారం అస్వస్థతకు గుర‌య్యారు.  బల్లి పడిన భోజనం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయినట్లు చెబుతున్నారు.  సాయంత్రం 6 గంటల సమయానికి హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు భోజనం పెట్టినట్లు విద్యార్థులు చెబుతున్నారు. భోజనం చేసిన కొద్దిసేపటి తర్వాత తీవ్ర తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు విరోచనాలకు గురైనట్లు తెలుపుతున్నారు. 
 
అధికారుల కథనం ప్రకారం వర్ధన్నపేటలోని ఆశ్రమ పాఠశాలలో 192 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 150 మంది విద్యార్థులు హాజరు కాగా, రాత్రి 7 గంటల తర్వాత విద్యార్థులకు వడ్డించే భోజనంలో ఓ విద్యార్థినికి బల్లి కనబడడంతో వంట మాస్టర్‌కు విషయం చెప్పారు. వంట మాస్టర్‌ నిర్లక్ష్యంగా ఏమీ కాదని పేర్కొంటూ విద్యార్థినులకు భోజనం వడ్డించాడు. 
 
ఆ భోజనం తిన్న 35 మంది విద్యార్థులు గంట తర్వాత కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. కొందరైతే కడుపు నొప్పిని బరించలేక అరుపులు.. పెడబొబ్బలు పెట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు 108 అంబులెన్స్‌ను రప్పించి, విద్యార్థినులను వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
వీరిలో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నర్సింహస్వామి తెలిపారు. అస్వస్థతకు గురైనవారిలో 7, 8, 9 తరగతులకు చెందినవారే అధికంగా ఉన్నారని వివరించారు. ఎంజీఎంకు తరలించిన ఎనిమిది మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది
అందుబాటులో ఉన్న కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రిని చేరుకుని కన్నీరు మున్నీరయ్యేలా రోదిస్తున్నారు. ప్రైవేటు విద్య చదివించే స్తోమత లేక వారి పిల్లలను ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా హాస్టల్లో తమ పిల్లలను చేర్పిస్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు తలలు బాదుకుంటున్నారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణం దిగ్భ్రాంతి చెందింది.
 కేవలం హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని సంఘటనా స్థలాన్ని చేరుకున్న వర్ధన్నపేట పట్టణ స్థానికులు వాదిస్తున్నారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా మారడానికి కారకులైన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల బంధుమిత్రులు అంటున్నారు.
 
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌కు ఫోన్‌చేసి విద్యార్థుల పరిస్థితిపై ఆరాతీశారు. అవసరమైతే హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించాలని సూచించారు.