భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల నిరసన

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన సాగర హారం కార్యక్రమాన్ని పోలీసులు అరెస్టులు అక్రమ కేసులతో అణిచి వేసే క్రమంలో ఉత్సవ సమితి నాయకులను,  వందలాది మంది కార్యకర్తలను అరెస్టు చేసి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో నిర్భందించారు. 
 
ప్రభుత్వం ఏర్పాట్లపై స్పష్టమైన హామి ఇచ్చేవరకూ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామని రాం గోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో అరెస్టులో ఉన్న ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు ఎం. రామరాజు, ప్రధాన కార్యదర్శి డా॥భగవంత్ రావు, కేంద్ర కమిటి సభ్యులు టి ఎన్  మురారి ప్రకటించారు. 
 
వారు, ఆమరణ నిరాహార దీక్షకు దిగగా సాయంత్రం పోలీసులు బలవంతంగా ఉత్సవ సమితి కార్యాలయం బహేతి భవన్ లో వదిలి వెళ్ళగా వారు కార్యాలయం లోనే దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఉత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. 
 
 హిందూ ధార్మిక హక్కును కాపాడటానికి ఉత్సవ సమితి చేస్తున్న ఉద్యమానికి హిందూ సంస్థలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయాలకు అతీతంగా యావత్ హిందూ సమాజం సంఘీభావం పలికి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపిచ్చింది.

ప్రభుత్వం గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేసేవరకు తమ నిరసన కొనసాగుతుందని డా. భగవంతరావు స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్ లోనే  గణేష్ విగ్రహల నిమజ్జనం కోసం అనుమతివ్వాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తోంది. 

గత ఏడాది హుస్సేన్ సాగర్ లో ఎలా  ఏర్పాట్లు చేశారో ఈ ఏడాది కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేయాలని డా. భగవంతరావు స్పష్టం చేశారు. ఈ నెల 9వ తేదీన హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహల నిమజ్జనం  చేస్తామని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. 

కాగా,  ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలంటూ ర్యాలీ చేసిన భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులను అరెస్ట్ చేయడం అన్యాయమని బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వినాయక సాగర్ వద్ద ఏర్పాట్లు చేయకపోతే హిందువులంతా గణేష్ నిమజ్జనం ఎక్కడ చేసుకోవాలని ప్రశ్నించారు.
 
తక్షణమే వినాయక్ సాగర్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని  ఆయన డిమాండ్ చేశారు. హిందూ పండుగలంటే సీఎం కేసీఆర్ కు అంత చులకనా అని ప్రశ్నించారు. వెంటనే  నిమజ్జన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేస్తూ లేనిపక్షంలో ఏం చేయాలో తమకు తెలుసని హెచ్చరించారు. సర్కార్ తీరుకు నిరనసగా బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.   
ఇలా ఉండగా, గణేష్ నిమజ్జనం సందర్భంగా హైకోర్టు గత నెలలో ఇచ్చిన ఆదేశాలనే పాటిస్తమని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హైకోర్టుకు తెలిపారు. తాజా హైకోర్టు ఆదేశాలను అనుసరించి వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కేవలం మట్టి వినాయకులను మాత్రమే ట్యాంక్ బండ్ కు అవతలి వైపు నిమజ్జనం చేయొచ్చని తెలిపారు. 
 
పీవీ ఘాట్ , ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ వైపు కూడా నిమజ్జనం చేయొచ్చని వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను  బేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేయాలని చెప్పారు. ‘‘ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం సమయం లో మార్గదర్శకాలను కోర్టు జారీ చేయాల్సి వస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోగా నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్దేశిత ప్రణాళికను రూపొందించాలి’’ అని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని సీపీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.