బెంగుళూరు దుస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం!

 భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలం కావడం, వరద నీటిలో చిక్కుకుపోవడానికి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు ఓ కారణమైతే, గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు కూడా మరో కారణమని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపించారు.
 
“కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో అసాధారణ రీతిలో వర్షాలు కురుస్తున్నాయి. గత 90 ఏళ్లలో ఈ తరహా వర్షాలను చూడలేదు. అన్ని ట్యాంకులు నిండిపోయాయి. పొంగి పొర్లుతున్నాయి. నిరంతరాయంగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కూడా వర్షాలు పడ్డాయి. కొందరు బెంగళూరు మొత్తం సమస్యలో చిక్కుకుందని అంటున్నారు. అది నిజం కాదు. రెండు జోన్లు సమస్యాత్మకంగా గుర్తించాం” అని తెలిపారు. 
 
వాటిలో మహదేవపుర ఒకటి అంటూ ఇది చాలా చిన్న ప్రాంతం అని, ఇక్కడ 69 ట్యాంకులు ఉండటమే అసలు సమస్య అని చెప్పారు. అన్నీ పొంగి పొర్లుతున్నాయని, ఆక్రమణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.  
‘బెంగళూరు వర్షాలు, వరదలతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది వాస్తవ పరిస్థితి. దాన్ని దాచిపెట్టలేం. అయితే ఈ స్థితికి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు ఓ కారణమయితే,నగరం ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా కారణమే’ అని బొమ్మై విమర్శించారు. 

‘నగరం ఈ దుస్థితికి చేరుకోవడానికి కారణం గత ప్రభుత్వం తీరే. తలా తోకా లేకుండా పాలించారు వాళ్లు. ఎటుపడితే అటు కట్టడాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. చెరువుల నిర్వహణను ఏ నాడూ పట్టించుకోలేదు. పైగా అవినీతితో చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు.అందుకే నగరం ఇప్పుడు నీట మునిగింది’ అని వివరించారు. 

అయినప్పటికీ ఆటంకాలను దాటుకుని ఎలాగైనా నగరంలో ని పరిస్థితులను పునరుద్ధరిస్తామని బొమ్మై భరోసా ఇచ్చారు. అలాగే మునుముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడతామని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిని తమ ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందని చెబుతూ ప్రభుత్వ అధికారులు, ఇంజనీర్లు, వర్కర్లు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రేయింబవళ్లూ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం చెప్పారు. తాము అనేక ఆక్రమణలకు విముక్తి కల్పించామని, ఇప్పటికీ ఆ పని చేస్తూనే ఉన్నామని చెప్పారు.
 
 ట్యాంకులకు స్లూయిజ్ గేట్లు పెట్టడం వల్ల వంటి చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతూ  వాటర్ డ్రైనింగ్‌ కోసం రూ.1,500 వెచ్చించామని, ఆక్రమణల తొలగింపులకు మరో రూ.300 కోట్లు ఇచ్చామని తెలిపారు. భవిష్యత్తులో వరద నీటి ముప్పు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 
 
 మంచినీటి సరఫరాలో తలెత్తిన అవాంతరాలపై అడిగిన ప్రశ్నకు మాండ్య జిల్లాలోని రెండు వాటర్ పంపింగ్ స్టేషన్లలో వరద నీటి ప్రభావం ఉందని చెప్పారు. మరో పంప్‌ హౌస్‌కు ఈరోజే క్లియరెన్స్ ఇచ్చామని చెప్పారు. ట్యాంకర్లు, బోర్‌వెల్స్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో బెంగళూరు  అతలాకుతలం అవుతోంది. సోమవారం ఉదయం కొన్ని నిమిషాల పాటు కురిసిన వర్షం నగరాన్ని చిగురుటాకులా వణికించింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లు చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. 
 
వరద నీటిలో చిక్కుకుపోయిన పలువురిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే నగరం ముఖచిత్రం మారిపోయింది. సిలికాన్ వ్యాలీ కాస్తా చిత్తడిచిత్తడిగా మారిపోయింది.  మరో మూడు నాలుగు రోజులు కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తప్పవన్న భారత వాతావరణ విభాగం హెచ్చరికతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వర్షాలపై మంత్రులతో సమీక్ష నిర్వహించారు.
 
నగరంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ నీట మునిగే ఉన్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు వరద నీటిలోనే తమ వాహనాలతో వెళ్తూ మధ్యలో ఆగిపోయి అవస్థలు పడుతూ ఉండడం, పాదచారులు మోకాటి లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లలేక అవస్థలు పడుతూ ఉన్న దృశ్యాలు నగరంలో ఎక్కడ చూసినా కనిసిస్తున్నాయి. సహాయక చర్యల కోసం ప్రభుత్వ అధికారులు, పడవలను, ట్రాక్టర్లను రంగంలోకి దించారు.