రాహుల్ రాకముందే గుజరాత్ యువజన కాంగ్రెస్ అధినేత రాజీనామా!

కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజీనామాల పర్వం జరుగుతుంది. ఏ రోజు ఎవ్వరు పార్టీకి రాజీనామా  చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్ లో పర్యటనకు సోమవారం రాహుల్ గాంధీ రావడానికి ఓ రోజు ముందే రాష్ట్ర యువజన  కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీకి రాజీనామా చేశారు. 

 ఆ పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్‌సిన్హ్ వాఘేలా తన పదవికి ఆదివారంనాడు రాజీనామా చేశారు. 35 ఏళ్ల వాఘేలా ఈ ఏడాది జనవరిలోనే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తన రాజీనామా తెలుపుతూ పార్టీ అధిష్టానానికివ్రాసిన లేఖలో తాను కాంగ్రెస్‌ పార్టీకి వీడ్కోలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. అయితే విశ్వనాథ్‌సింగ్ వాఘేలా ఏ పార్టీలో చేరుతారో అన్నది ఇంకా మాత్రం చెప్పలేదు.

కాంగ్రెస్ పార్టీ ”భారత్ జోడో యాత్ర” త్వరలో ప్రారంభం కానుండటం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్న నేపథ్యంలో ఈనెల 5న అహ్మదాబాద్‌లోని సబర్మతి రీవర్‌ప్రెంట్ వద్ద జరిగే ‘పరివర్తన్ సంకల్ప్’ సదస్సులో రాహుల్ పాల్గొంటున్నారు. బూత్ స్థాయి కార్యకర్తలకు రాహుల్ ఈ సదస్సులో దిశానిర్దేశం చేయనున్నారు.

“రాహుల్ గాంధీ రేపు గుజరాత్‌కు వస్తున్నారు. ‘కాంగ్రెస్‌లో చేరండి’ అనే ప్రచారాన్ని చేపట్టనున్నారు. అయితే గుజరాత్‌లో ‘క్విట్ కాంగ్రెస్ ప్రచారం’ కొనసాగుతోంది” అంటూ  గుజరాత్‌ బీజేపీ అధికార ప్రతినిధి రుత్విజ్ పటేల్ ఎద్దేవా చేశారు.