జార్ఖండ్‌లో పేట్రేగిపోతున్న లైంగిక నేరగాళ్ల ముఠా

దళిత, ఆదివాసీ బాలికలపై లైంగిక దాడులు, నేరాలకు పాల్పడే గ్రూమింగ్ గ్యాంగ్ జార్ఖండ్‌‌లో పేట్రేగిపోతోందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. మైనర్ బాలికల హత్యలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. మహిళలపై నేరాలు పెరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, జార్ఖండ్‌లో గ్రూమింగ్ గ్యాంగ్‌లు చురుగ్గా ఉన్నాయన్నారు. బంగ్లాదేశీ ముస్లిం యువకులు రాష్ట్రంలోని మైనర్ దళిత, ఆదివాసీ బాలికలను దోచుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సొరేన్ ప్రభుత్వం గాఢ నిద్రలో ఉందని ధ్వజమెత్తారు. బాధిత బాలిక మూడు నెలల గర్భిణి అని తెలిసిందని, దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

జార్ఖండ్‌లోని డుమ్కాలో పద్నాలుగేళ్ళ గిరిజన బాలిక అత్యాచారం, హత్యకు గురైంది. ఆమె మృతదేహం ఓ చెట్టుకు వేలాడుతుండగా శుక్రవారం గ్రామస్థులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడు అర్మాన్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక రావలసి ఉంది. స్థానికుల కథనం ప్రకారం, మృతురాలు తన అత్తతో కలిసి నివసించేవారు. ఆమెకు అన్సారీతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమె గర్భవతి అయింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అన్సారీని కోరింది. అనంతరం ఈ హత్య జరిగింది.

ఇటీవల డుమ్కాలో అంకిత అనే 12వ తరగతి విద్యార్థినిపై షారూఖ్ అనే యువకుడు దారుణంగా దాడి చేసి, పెట్రోలు పోసి, నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర గాయాలతో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. షారూఖ్‌ను అరెస్టు చేశారు. అతనిని కఠినంగా శిక్షించాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.