దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తు బీజేపీ పార్టీనే

దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తు బీజేపీ పార్టీనేనని  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం నుంచి కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతోందని తెలిపారు. అలాగే, ప్రపంచం నుంచే కమ్యూనిస్ట్‌ పార్టీలు కనుమరుగవుతున్నట్లు చెప్పారు. ‘భారత్‌ నుంచి కాంగ్రెస్‌ అంతరించిపోతోంది. అలాగే కమ్యూనిస్ట్‌ పార్టీ సైతం ప్రపంచం నుంచే కనుమరుగవుతోంది. కేరళలో ఒక్క బీజేపీ పార్టీకే భవిష్యత్తు.’ అని అమిత్‌ షా భరోసా వ్యక్తం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ వెనకబడిన తరగతులు, మైనారిటీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్ట్‌ పార్టీలు ఎప్పుడూ పని చేయలేదని అమిత్ షా విమర్శించారు. వారిని కేవలం ఓటు బ్యాంకులాగే చూశారని దుయ్యబట్టారు. దేశం కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సేవలను కాంగ్రెస్‌ విస్మరించిందని, అందుకే వారి పాలనలో భారతరత్న ఇవ్వలేదని ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాలు నదీజలాల సమస్యలకు పరిష్కరించుకోవాలి 

ఇలా ఉండగా, నదీజలాల సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించాలని దక్షిణాది రాష్ట్రాలను అమిత్ షా కోరారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్‌లు హాజరైన 30వ దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ప్రత్యేకంగా కోరారు. 

దక్షిణాది రాష్ట్రాలు నదీ జలాల సమస్యలు, వివాదాలకు ఉమ్మడి పరిష్కారం కనుక్కోవాలని అమిత్‌షా సూచించారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణా జలాల వివాదాన్ని పరస్పర చర్చలతో పరిష్కరించుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

కాగా, ఏపీ సహా  దక్షిణాది రాష్ట్రాల తీర ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని అమిత్‌షా అన్నారు. ‘‘దేశంలో మొత్తం 9 తీరప్రాంత రాష్ట్రాలుండగా.. వాటిల్లో సింహభాగం వాటా దక్షిణాదిదే. మొత్తం 7,500కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరంలో.. దక్షిణాది రాష్ట్రాల వాటా 4,800 కిలోమీటర్లు. దేశంలోని 12 ప్రధాన పోర్టుల్లో ఏడు దక్షిణాదిలో ఉ న్నాయి. అందుకే.. ఈ ప్రాంతాల్లో ప్రాజెక్టులను చేప ట్టాం. ఎనిమిదేళ్లలో రూ.76 వేల కోట్ల అంచనా వ్య యంతో 108 ప్రాజెక్టులను పూర్తిచేశాం’’ అని ఆయన వివరించారు.

రెండు తెలుగు రాష్ట్రాలు తమ మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడం కేవలం వారికి మాత్రమే కాకుండా, మొత్తం దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి, దేశాభివృద్ధికి అవసరమని ఆయన స్పష్టం చేశారు.  జలాల పంపకానికి సంబంధించిన సమస్యలకు ఉమ్మడి పరిష్కారాన్ని అన్వేషించాలని దక్షిణ జోనల్ కౌన్సిల్‌లోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి పిలుపునిచ్చారు.

దక్షిణాదిలోని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలలో తమిళనాడు, కర్నాటక మధ్య కావేరి సమస్య.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణా నదీ జలాల భాగస్వామ్య వివాదం ఉన్నాయి. ఈ సమావేశంలో మొత్తం 26 అంశాలు చర్చించారు. వీటిలో 9 సమస్యలను పరిష్కారించారు. మరో 17 అంశాలు తదుపరి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు.

వీటిలో 9 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవి అని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమ పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవాలని అమిత్ షా ఈ సందర్భంగా కోరారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు  పాల్గొనగా,  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనలేదు.