తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమైక్యతా వజ్రోత్సవాలట! 

సమైక్యత ఎవరెవరి మధ్య? 
 
డా. వడ్డీ విజయసారధి, 
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త, `జాగృతి’ పూర్వ సంపాదకులు 
 
2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించినవారు క్రొత్తగా మన ప్రభుత్వాధినేతలకు పాఠాలేవో నేర్పినట్లున్నారు! అందుకనే ఈ లైను తీసుకొని ఉంటారు.
 
 1948 సెప్టెంబరులో ఒక కొలిక్కి వచ్చిన శతాబ్దాల లేదా దశాబ్దాల పోరాటంలో సంస్కృతి, ధర్మముల రక్షణ గురించిన పోరాటం ఉంది. మొదట్లో ముసునూరి నాయకులు, ఆపై విజయనగర రాజులు, సమర్థ రామదాసు, ఆపై ఆర్యసమాజమూ దీనికి నాయకత్వం వహించారు. మన రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్మరించుకోదలచలేదు అనుకోవాలా?
 
 భాషాపరంగా అణగదొక్కడం జరిగింది. దానికి జవాబుగా ఆంధ్ర మహాసభ, ఆంధ్ర సారస్వత పరిషత్ వంటి సంస్థలు దేవులపల్లి రామానుజరావు వంటి పెద్దల నాయకత్వంలో తమ కార్యకలాపాలు ఆరంభించినవి. ఇవీ స్మరించుకో దగినవి కావా? 
 
నిజాం జమానాలో సభలు, సమావేశాలు జరుపుకొన డానికి అవకాశముండేది కాదు. స్వామీ రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు ప్రభృతుల నేతృత్వంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ దీనిని ప్రతిఘటించింది. ఇదీ స్మరించుకోదగని జాబితాలో వేయబడిందా?
 
  కొమర్రాజు లక్ష్మణరావు, మందుముల నరసింహా రావు, భాగ్యరెడ్డివర్మ, రావు బహాదుర్ (పాశం) వెంకట్రామారెడ్డి, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాప రెడ్డి వంటి రచయితలు ప్రజానీకాన్ని పత్రికల ద్వారా, గ్రంథాల ద్వారా, గ్రంథాలయాల ద్వారా మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు. అవీ స్మరింపదగనివేనా?
 
 గాంధీగారి నేతృత్వంలోనో , పిలుపు మేరకో జరిగిన న్యాయస్థానాల బహిష్కరణకు మించిన స్థాయిలో ఇక్కడ న్యాయాలయాల బహిష్కరణ ప్లీడర్స్ ప్రొటెస్ట్ కమిటీ ఆధ్వర్యంలో వినాయకరావ్ విద్యాలంకార్ వంటి మేధావుల నాయకత్వంలో పటిష్టంగా అమలు చేయబడింది. దాని గురించి ఈ తరానికి తెలియజేయ నక్కర లేదా?
 
నైజాం విముక్తి పోరాటం అన్నపుడు ఒక ప్రజానీకం తన అస్తిత్వాన్ని నిలుపుకొనడానికి ఎన్ని తీరుల ఉద్యమించిందో, ఆ మధుర జ్ఞాపకాలన్నీ ప్రస్తావనకు వస్తాయి.
 
 “చచ్చిన జాతి కాదు, మరి చావదు వేయి యుగాలకైన..” అని గొంతెత్తి మరోసారి పడుకోవాలనిపిస్తుంది. 
 
 “నా తెలంగాణ కోటి రత్నాల వీణ”, “రైతుదే తెలంగాణము, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?” అని దాశరథి వంటి మన కవులు గర్జనలు గుర్తుకు వస్తాయి. 
 
“బండెనక బండి కట్టి, పదహారు బండ్లు గట్టి… నీగోరికడ్తము కొడుకో నైజాము సర్కరోడా! 
నైజాము సర్కరోడా, నాజీల మించినోడా!” అనే సంకల్పం స్మరించుకుంటే మన వారిలో కొందరి మస్తిష్కాల నావరించిన బూజు వదిలిపోతుంది.
 
ఇదేమీ వద్దు, మేమూ ఉత్సవాలు జరిపినాం, రైతాంగ సాయుధ పోరాట యోధుల వారసులను సన్మానించినాం, తారా జువ్వలు ఎగరేసినాం అంటే అది ఎవరికి ఏ విధంగా ప్రయోజనకరమో ఆలోచించాలి. 
 
సమైక్యతా ఉత్సవాలు అనే మాట వినడానికి బాగున్నా, తెరాస నాయకుల నోటి నుండి వింటున్నపుడు ఆ మాట కొంత వింతగా ఉంటుంది. గుండెలోతుల నుండి వస్తున్నట్లుగా గాక, తాత్కాలిక అవసరాల కొరకు చేస్తున్న కొంగజపంలా అనిపిస్తుంది. మరి వీటి ద్వారా ప్రభువులు ఏమి సాధించ గోరు తున్నారో వారికే తెలియాలి.