జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఢిల్లీ కోర్టు సమన్లు

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 26 న కోర్టు ఎదుట హాజరుకావాలని  ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను వచ్చేనెల 12న  ఢిల్లీ పోలీసులు విచారించాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. 
 
రూ. 200 కోట్ల దోపిడీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్  ఫెర్నాండేజ్ ను నిందితురాలిగా పేర్కొంది. ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ లో ఆమెను నిందితురాలిగా పేర్కొంది.  ఫార్మాస్యూటికల్ దిగ్గజం రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ల సభ్యులైన అదితి సింగ్ , శివేందర్ సింగ్ నుండి సుమారు రూ. 215 కోట్లు వసూలు చేసిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. 
 
ఈ కేసులో చంద్రశేఖర్ భార్య లీనా మరియా పాల్, పింకీ ఇరానీ సహా ఎనిమిది మందిని ఈడీ అరెస్టు చేసింది. వీరిపై  రెండు ఛార్జిషీట్లు కూడా దాఖలు చేసింది.చంద్రశేఖర్ మనీలాండరింగ్ చేసిన డబ్బును ఎలా ఉపయోగించారనే విషయాన్ని ఈడీ తన మొదటి ఛార్జిషీట్‌లో పేర్కొంది. అతను మోసం చేసిన మొత్తంలో  జాక్వెలిన్ కు రూ. 5.71 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చాడని ఈడీ పేర్కొంది. 
 
దోపిడి చేసిన డబ్బు నుంచి ఆమె లబ్ది పొందినట్టుగా దర్యాప్తులో గుర్తించినట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయి. సుకేష్ చంద్రశేఖర్ నేరస్థుడని, దోపిడీదారుడని జాక్వెలిన్‌కు తెలుసునని ఛార్జిషీట్‌లో పేర్కొంది.  అక్రమంగా వచ్చిన ఆదాయంతో విలువైన బహుమతులు కొనుగోలు చేసినట్టు జాక్వెలిన్ కు తెలుసునని ఈడీ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి జాక్వెలిన్‌కు చెందిన రూ. 7.27 కోట్లను ఈడీ అటాచ్ చేసింది. 
 
అటాచ్ చేసిన ఆస్తుల్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరుతో ఉన్న రూ.7.12 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసుుకు సంబంధించి జాక్వెలిన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు విచారించింది.ఈ క్రమంలోనే ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. అయితే తాను 2017లో చంద్రశేఖర్‌ను కలిశానని జాక్వెలిన్ ఈడీకి తెలిపారు.