2047 నాటికి 20 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్

2047 నాటికి దేశం 20 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఈఏసీ పీఎం ఛైర్మన్‌ బిబేక్‌ దేబ్‌రాయ్‌ భరోసా వ్యక్తం చేశారు. అయితే, అందుకు  వచ్చే 25 సంవత్సరాలు సంవత్సరానికి 7 నుంచి 7.5 శాతం వృద్ధిరేటును కొనసాగించ గలగాలి చెప్పారు. ఆ విధంగా జరిగితే మన దేశం 2047 నాటికి అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ దేశంగా మారుతుందని తెలిపారు.
‘భారత్@100కు పోటీపడగల రోడ్ మ్యాప్’ ప్రణాలికను ఆవిష్కరిస్తూ రాబోయే సంవత్సరాలలో భారత దేశ అభివృద్ధి ప్రయాణంకు నూతన మార్గదర్శకాలు రూపొందించిన్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు,  వివిధ మంత్రుత్వ శాఖలకు, వివిధ భాగస్వాములకు నిర్దిష్ట లక్ష్యాల సాధన కోసం విభిన్నమైన ప్రమాణాలు రూపొందించినట్లు తెలిపారు. రంగాల వారీగా, ప్రాంతాల వారీగా రూపొందించిన విధానాలతో ఈ మార్గదర్శకాలు భారత్ ను అభివృద్ధి చెందిన దేశం వైపు పయనింప చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
ప్రస్తతం మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఆరోవదిగా ఉందని చెబుతూ,  ప్రస్తుతం మన దేశ జీడీపీ 2.7 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందని చెప్పారు. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరిలో ఉందని పేర్కొంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని ప్రధాన మంత్రి ఎకనమిక్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ (ఈఏసీ-పీఎం) ఛైర్మన్‌ బిబేక్‌ దేబ్‌రాయ్‌ చెప్పారు.
అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ దేశంగా మారడం అంటే పూర్తి ధనవంతులుగా మారడం కాదని, ఇప్పుడున్న స్థితి నుంచి సగటు ఆదాయాలు పెరగడం ద్వారా ఎగువ మధ్యతరగతి ప్రజలుగా ఎక్కువ మంది మారడమని ఆయన వివరించారు. మన సమాజ స్వభావం పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్‌ లెక్క ప్రకారం తలసరి ఆదాయం 12 వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే ధనిక దేశంగా పిలుస్తారని చెప్పారు.
రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రకారం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.4 శాతం వరకు ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటని ఐఎంఎఫ్‌ పేర్కొందని గుర్తు చేశారు.
“ఎంత తక్కువగా అనుకున్నా 7 నుండి 7. 5 శాతం వరకు వార్షిక వృద్ధి రేట్ సాధించగలిగినా తలసరి ఆదాయం 10,000  డాలర్లకు పెరిగి,  2047 నాటికి భారత్ ను 20 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక పైగా మారుస్తోంది” అని ఆయన ధీమా  వ్యక్తం చేశారు. 
అభివృద్ధి చెందిన దేశమంటే ఆర్థికాభివృద్ధి అధికంగా ఉండటం, తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటడం, జీవన ప్రమాణాలు ఉన్నతస్థాయిలో ఉండాలని బిబేక్‌ దేబ్‌రాయ్‌ వివరించారు. మానవ అభివృద్ధి సూచిక సహితం బాగుండాలని, విద్య, వైద్యం ఉన్నత స్థితిలో ఉండాలని తెలిపారు. అప్పుడే అది అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారని చెప్పారు.
మన దేశం ఈ దిశగానే వృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో మన దేశ జీడీపీ రూ. 2.5 లక్షల కోట్లు ఉంటే ప్రస్తుతం అది రూ. 150 లక్షల కోట్లుగా ఉందని చెప్పారు. వృద్ధిరేటు ఇలానే కొనసాగితే మన దేశం అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ దేశంగా మారుతుందని స్పష్టం చేశారు.