గుజరాత్‌ అల్లర్లు కేసులను సుప్రీం కోర్ట్ కొట్టివేత

గుజరాత్‌ అల్లర్లు కేసులను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. 2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో హింసాకాండ కేసులపై సరైన విచారణ జరిపించాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) దాఖలు చేసిన పిటిషన్లతో సహా పది పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 

2002 ఫిబ్రవరి నాటి గోద్రా మారణ హోమం తరువాత గుజరాత్‌లో చోటుచేసుకున్న పరిస్థితులపై ఎన్‌హెచ్‌ఆర్‌సి దాఖలు చేసిన బదిలీ పిటిషన్లు, అల్లర్ల బాధితులు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు, హింసాత్మక కేసుల్లో గుజరాత్‌ పోలీసుల నుంచి దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని కోరుతూ 2003-04 మధ్య కాలంలో ఎన్‌జిఒ ఫర్‌ జస్టిస్‌ సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లు ఉన్నాయి. 

మంగళవారం ఈ పిటిషన్లపై సిజెఐ జస్టిస్‌ యుయు లలిత్‌, న్యాయమూర్తులు ఎస్‌ రవీంద్ర భట్‌, జెబి పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అల్లర్లకు సంబంధించిన తొమ్మిది కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌ కోసం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ధర్మాసనం ఏర్పాటు చేసింది. 

అందులో ఎనిమిది కేసుల్లో విచారణ పూర్తయిందని తెలిపింది. సిట్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ నరోదా గావ్‌ ప్రాంతానికి సంబంధించిన ఒక అంశం (తొమ్మిదో కేసు) మాత్రమే విచారణ ఇంకా పెండింగ్‌లో ఉందని, అది కూడా తుది దశలో ఉందని తెలిపారు. ఇతర కేసుల్లో ట్రయల్స్‌ పూర్తయ్యాయని, కేసులు హైకోర్టు, సుప్రీం కోర్టులో అప్పీలు దశలో ఉన్నాయని చెప్పారు. 

పిటిషనర్ల తరపు న్యాయవాదులు అపర్ణా భట్‌, ఎజాజ్‌ మక్బూల్‌, అమిత్‌ శర్మలు సిట్‌ ప్రకటనను అంగీకరించారని, అందువల్ల ఈ పిటిషన్లపై విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. నరోదా గావ్‌కు సంబంధించి విచారణను చట్టం ప్రకారం ముగించాలని, ఆ మేరకు న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి కచ్ఛితంగా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునే హక్కు ఉందని తెలిపింది.

సిటిజన్స్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ స్వచ్ఛంద సంస్థ అల్లర్ల కేసుల్లో సరైన దర్యాప్తు కోసం సుప్రీం కోర్టులో దరఖాస్తులు చేసుకున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని న్యాయవాది అపర్ణా భట్‌ ధర్మాసనానికి తెలిపారు. గుజరాత్‌ పోలీసులు నమోదు చేసిన తాజా కేసులో ఆమె ప్రస్తుతం కస్టడీలో ఉన్నందున సెతల్వాద్‌ నుంచి సమాధానం పొందలేమని న్యాయవాది పేర్కొన్నారు. 

ఉపశమనం కోసం సంబంధిత అధికారి ముందు దరఖాస్తు చేసుకునేందుకు సెతల్వాద్‌కు ధర్మాసనం స్వేచ్ఛ ఇచ్చింది. సెతల్వాద్‌ తన రక్షణ కోసం సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకునే హక్కు ఇస్తున్నామని, ఆమె దరఖాస్తు చేస్తే అది చట్టానికి అనుగుణంగా వ్యవహరించబడుతుందని ధర్మాసనం పేర్కొంది.