బాబ్రీ మసీదు కోర్టు ధిక్కార కేసుకు `సుప్రీం’ ముగింపు

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంపై దాఖలైన కోర్టు ధిక్కార కేసును సుప్రీంకోర్టు మంగళవారం ముగించింది. వివాదాస్పద భూమిపై హిందూ సంస్థలకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ పిటిషన్‌ నిరుపయోగంగా మారిందని న్యాయమూర్తులు జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 

ధిక్కార పిటిషనర్‌ను అమికస్‌ క్యూరీతో భర్తీ చేయాలన్న అభ్యర్థనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. డిసెంబర్‌ 1992లో బాబ్రీ మసీదు కూల్చివేయబడింది. నిర్మాణాన్ని పరిరక్షిస్తామని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ అదే జరిగింది. దీంతో యుపి ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. 

2019లో అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2020 సెప్టెంబర్‌లో లక్నోలోని సిబిఐ ప్రత్యేక కోర్టు మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వాని, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్‌, బిజెపి నేతలు మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతితోపాటు మరికొంత మందిని కూల్చివేత కేసులో నిర్దోషులుగా ప్రకటించింది. 

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) మసీదు విధ్వంసానికి దారితీసిన ఏదైనా కుట్రను రుజువు చేయడానికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైంది. వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేసేందుకు కుట్ర లేదా రెచ్చగొట్టేందుకు ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు లేవని ప్రత్యేక కోర్టు పేర్కొంది.